మహేష్ మాటల్లో కశ్మీర్‌

కశ్మీర్‌… అందం, ఆహ్లాదాల నడుమ ఓ భూతల స్వర్గం. స్నేహం, సౌహార్దం, ఆత్మీయత అక్కడి జనం సహజ గుణం. అది వెండితెరను వెలిగించిన మంచుకొండల నిలయం. కారణాలు ఏమైనా మధ్యలో చాన్నాళ్ళు విరామం. ఇటీవలే మళ్ళీ కశ్మీర్‌ షూటింగులతో కళకళలాడుతోంది. అంతలోనే ఎన్నో రాజకీయ పరిణామాలు. భౌగోళికంగా రెండు ముక్కలు.

ఆకుపచ్చని లోయలు, యాపిల్‌ తోటలు. అందమైన గుల్మార్గ్‌, దాల్‌ సరస్సు మాత్రం ఆహ్వానం ఆపలేదు. మంచుకొండల్లో చంద్రుడు మళ్ళీ మళ్ళీ వచ్చిపొమ్మంటున్నాడు. ముక్కుపచ్చలారని కశ్మీరం ఒయ్యారం చూడమంటున్నాడు. సరిలేరు నీకెవ్వరు కశ్మీర్‌ షూటింగ్‌ కబుర్లతో ఇది సండే స్పెషల్‌! సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి ఆ షూటింగ్ విశేషాలను పంచుకున్నారు.

మహేష్ బాబు ఆ విషయాలను ఇలా చెప్పుకొచ్చారు. బాలనటుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు హీరోగా పాతిక సినిమాల వయసు దాకా ఇప్పటి వరకూ ఎన్నెన్నో ప్రాంతాల్లో షూటింగ్‌ చేశా. వాటిలో మన దేశంలోని అందమైన లొకేషన్లున్నాయి. విదేశాలూ ఉన్నాయి. కానీ, భూతల స్వర్గంగా పేరున్న కశ్మీర్‌లో నేనెప్పుడూ షూటింగ్‌ చేయలేదు. ఆ అవకాశం రాలేదు.

ఇటీవలే తొలిసారిగా కశ్మీర్‌లో షూటింగ్‌ చేశా. నా రాబోయే చిత్రం సరిలేరు నీకెవ్వరు కోసం అక్కడ ఒక మేజర్‌ షెడ్యూల్‌ చిత్రీకరించాం. నిజంగా అదో మరపురాని అనుభూతినిచ్చింది. ఈ చిత్రంలో నేను ఓ ఆర్మీ అధికారిగా నటిస్తున్నా. అందువల్ల కశ్మీర్‌ నేపథ్యం, ఆ లొకేషన్లు చక్కగా కుదిరాయి. మా అమ్మాయి సితార పుట్టినరోజు కూడా ఈ షూటింగ్‌ సందర్భంగానే వచ్చింది.

దాంతో, ఆనందంగా గడిపేశాం. కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాలు, అక్కడి వాతావరణం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. కశ్మీర్‌ పేరు వినగానే మనం ఏమేమో అనుకుంటూ ఉంటాం. అనవసర భయాలకు పోతుంటాం. కానీ, అక్కడి స్థానిక ప్రజలు ఎంతో మంచివాళ్ళు. తమ ప్రాంతానికి వచ్చినవాళ్ళతో ఎంతో స్నేహంగా ఉంటారు. వాళ్ళు మా సినిమా టీమ్‌కు ఎంతో సహకరించారు.

దాంతో, శ్రమ అనిపించకుండా షూటింగ్‌ చేయగలిగాం. అందుకే, కశ్మీర్‌లో మళ్ళీ మళ్ళీ షూటింగ్‌ చేయాలని ఉంది. నాకైతే ఎప్పుడెపుడు మరోసారి కశ్మీర్‌లో షూటింగ్‌ చేద్దామా అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు చేయడానికి ముందే జూలై ఆఖరు కల్లా అక్కడ మా షూటింగ్‌ అంతా పూర్తయిపోయింది. హైదరాబాద్‌ వచ్చి, ఇప్పుడిక్కడ కొత్త షెడ్యూల్‌ చేస్తున్నాం అన్నారు మహేష్.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు చిత్రం తొలి షెడ్యూల్‌ కశ్మీర్‌లో చేశాం. అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర కథ ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌లో జరుగుతుంది. సినిమాలో మహేష్ మేజర్‌గా నటిస్తున్నారు. సినిమా ప్రథమార్ధం 20-25 నిముషాల సేపు కశ్మీర్‌లోనే ఉంటుంది. ఆర్మీ బేస్‌లో హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌, కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉంటాయి.

హీరో అక్కడ ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడకు వస్తారు. మిలటరీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కశ్మీర్‌లో తీస్తేనే ఒరిజనల్‌ ఫీల్‌ వస్తుందని అక్కడకు వెళ్లాం. ఇంతకు ముందు భద్రతా కారణాల వల్ల కశ్మీర్‌లో తీయాల్సిన సన్నివేశాలను ఏ కులు-మనాలీలోనే తీసేవారు. కానీ నిజానికి కశ్మీర్‌లో ఉన్న అందాలు మరెక్కడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అది భూతల స్వర్గం.

అయితే అల్లర్లు, గొడవల మధ్య షూటింగ్‌ చేయడం కష్టమని భావించి సినిమా వాళ్లు కశ్మీర్‌ వెళ్లడానికి భయపడుతుంటారు. మేం కూడా అక్కడ షూటింగ్‌ చేయగలమా అని మొదట చాలా భయపడ్డాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. అక్కడి వాళ్లు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టూరిస్టులంటే వారికి ఎంతో గౌరవం.

షూటింగ్స్‌ అక్కడ ఎక్కువగా జరిగితే టూరిజం అభివృద్ధి చెందుతుంది కనుక వాళ్ల సహకారం చాలా ఉంది. మా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ఎక్కడా గొడవలు జరగలేదు. ఎవరూ మా షూటింగ్‌కు ఇబ్బంది కలిగించలేదు. మేం షూటింగ్‌ చేయడానికి కొన్ని రోజుల ముందు వెంకటేష్, నాగచైతన్యల సినిమా వెంకీ మామ షూటింగ్‌ అక్కడే జరిగింది. వాళ్లు 25 రోజులు అక్కడ వర్క్‌ చేశారు.

మేం దాదాపు 20 రోజులు షూటింగ్‌ చేశాం. ఇప్పుడు చాలా సినిమాల షూటింగ్స్‌ కశ్మీర్‌లో జరుగుతున్నాయి. షూటింగ్స్‌కు చాలా అనుకూలమైన ప్రదేశమది. ఈ సినిమా కోసమే తొలిసారిగా కశ్మీర్‌ వెళ్లాను. షూటింగ్‌ చేయడానికి కొన్ని రోజుల ముందు లొకేషన్స్‌ సెలెక్ట్‌ చేయడం కోసం వెళ్లాను. సోనా మార్గ్‌, పెహల్‌గామ్‌, శ్రీనగర్‌ ఇవన్నీ చూసి, మాకు కావాల్సిన లొకేషన్లు ఎంపిక చేశాం.

ఆ లొకేషన్లలోనే షూటింగ్‌ చేశాం. కథ ఫైనలైజ్‌ అయిన తర్వాత లొకేషన్ల గురించి ఆలోచిస్తున్నప్పుడు కశ్మీర్‌ ప్రస్తావన వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్టార్‌ హీరోతో అక్కడ షూటింగ్‌ చేయడం రిస్క్‌ ఏమో అని మొదట మేం తటపటాయించాం. కానీ మహేష్ ఎంకరేజ్‌ చేశారు. అక్కడ మంచి సెక్యూరిటీ ఉంటుంది. కశ్మీర్‌ వంటి అందమైన ప్రదేశం లేదు. వేరే ఏమీ ఆలోచించకండి.

కశ్మీర్‌లోనే షూటింగ్‌ చేద్దాం అని సపోర్ట్‌ చేశారు మహేష్. ఆయనంత కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో మేం కూడా ధైర్యంగా ముందడుగు వేశాం. కశ్మీర్‌లో స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చాలా మందికి టూరిజమే జీవనాధారం. ముఖ్యంగా కశ్మీరీలు స్నేహపాత్రులు. షూటింగ్స్‌కు ఎంతో సహకరిస్తుంటారు. రాజకీయపరమైన విషయాల గురించి నేను మాట్లాడను.

వాటి గురించి కామెంట్‌ చేయను కూడా. అయితే మేం షూటింగ్‌ చేసి వచ్చిన తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. అక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది. సెక్యూరిటీని చాలా టైట్‌ చేశారు అని చెప్పుకొచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి.

Share

Leave a Comment