కళ్లు చెదిరేలా సెట్ రెడీ

భరత్ అనే నేను, మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు, వరుస సక్సెస్‌లను సొంతం చేసుకొన్న అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై మాహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఇంట్రో టీజర్, అలానే స్వతంత్ర దినోత్సవం నాడు భారత సైనికులకు నివాళిగా రిలీజ్ చేసిన సాంగ్ యూట్యూబ్ లో మంచి వీక్షకధారణను సంపాదించాయి.

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పక్కా ప్రణాళికతో జరుగుతుంది. మొదటి షెడ్యూల్ ను కాష్మీర్ లో పూర్తిచేసిన సంగతి తెలిసిందే. తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో కళ్లు చెదిరే సెట్ వేశారు. కర్నూలు జిల్లాకే తలమానికంగా మారిన కొండారెడ్డి బురుజు సెట్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేశారు.

ఆ సెట్‌కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. నిజంగా కొండారెడ్డి బురుజా అనే ఫీలింగ్‌ను కలిగించేలా సెట్ ఉండటంతో విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొన్ని సమస్యల వల్ల లైవ్ లొకేషన్ కి వెళ్లడం కుదరలేదట. అందుకే రామోజీ ఫిలింసిటీలో ఈ లొకేషన్ ని సెట్స్ రూపంలో రీక్రియేట్ చేసారు.

ఒక రియల్ లొకేషన్ ని సెట్స్ లో మళ్ళీ సృష్టించాలి అంటే ఆశామాషీ వ్యవహారం కాదు. సెట్ అవసరం లేదని మొదట అనుకున్నప్పటికీ, ఆ తరువాత అసలు లొకేషన్ లో షూటింగ్ జరపడంలోని సమస్యలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కొండారెడ్డి బురుజు ఆ చుట్టు పక్కల పరిసరాల్లో ఉండే వీధుల్ని సెట్స్ లో క్రియేట్ చేసారు.

ఇక్కడే సరిలేరు నీకెవ్వరు ద్వితీయార్థానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. 13 ఏళ్ళ తరువాత విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడో కాశ్మీర్ బోర్డర్ లో ఉండే మహేష్ కు విజయశాంతికు లింక్ రివీల్ అయ్యాకే స్టొరీ ముందుకు వెళ్తుందని టాక్. ఈ క్రమంలో వచ్చే ఎపిసోడ్స్ అన్ని ఫ్యాన్స్ కి, మాస్ మూవీ లవర్స్ కి పండగలా ఉంటాయని ప్రచారం జరిగిపోతుంది.

మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. విజయశాంతి సన్నివేశాలను హైదరాబాద్ నల్సార్ లా కాలేజీలో చిత్రీకరించినట్లు సమాచారం. మరి ఆవిడ పాత్రేంటో తెలియాలంటే దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇవ్వాల్సిందే. రాజేంద్రప్రసాద్ మరో ముఖ్యపాత్రలో అలరించనున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీకి కొదవ ఉండదు.

ఈ సారి ఇంకా భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ఎలాంటి బ్లాక్‌బస్టర్ గా నిలవనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. సరిలేరు నీకెవ్వరు మూవీ టీమ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.

అదేమిటంటే, సూపర్ ఫ్యాన్స్ అందరూ తమకు నచ్చిన విధంగా సరిలేరు నీకెవ్వరు మూవీకి సంబంధించి ఫ్యాన్ మెడ్ ట్రిబ్యూట్ వీడియోస్ మరియు పోస్టర్స్ ని క్రియేట్ చేయాలని, అలా క్రియేట్ చేసి పోస్ట్ చేసిన వాటి నుండి, తాము ఎంపిక చేసిన బెస్ట్ వీడియోస్ మరియు పోస్టర్స్ ను, త్వరలో తమ అఫీషియల్ పేజెస్ లో పోస్ట్ చేయడం జరుగుతుందని తెల్పడం జరిగింది.

దీనితో సూపర్ ఫ్యాన్స్ అప్పుడే తమ తమ టాలెంట్ ని చూపించేందుకు పోస్టర్స్, వీడియోస్ ని రెడీ చేసి వాటిని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. మరి వాటినుండి ఎవరి పోస్టర్స్, వీడియోస్ సెలెక్ట్ అవుతాయో తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాలి. మీరు కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొనండి.

Share

Leave a Comment