నాన్‌స్టాప్ పరుగే పరుగు

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు జెట్ స్పీడ్ తో పూర్తవుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు మహేష్ వరస విజయాలతో దూకుడు మీద ఉండడం మరోవైపు అనిల్ రావిపూడి కంటిన్యూ గా హిట్స్ సాధిస్తూ ఫుల్ జోష్ లో ఉండడంతో ఈ కాంబినేషన్ పై భారీ ఆసక్తి నెలకొంది.

స్క్రిప్టు వర్క్.. షెడ్యూల్స్.. రిలీజ్ తేదీ సహా ప్రతిదీ ఎంతో క్లారిటీగా వెళుతున్న అనిల్ రావిపూడి చెప్పిన దాని ప్రకారమే ఒక్కో షెడ్యూల్ ని ముగించేస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకొని హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ ని అంతే వేగంగా పూర్తి చేసేస్తున్నాడట.

హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ సహా రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్లు వేసి షూటింగ్ చేస్తున్నారని ఇది వరకూ వెల్లడించాం. ఒక భారీ ట్రైన్ సెట్ ని నిర్మించి అందులో ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ని రావిపూడి ట్వీట్లతో మనకు అర్ధం అయ్యింది. ప్రస్తుతం ఈ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తి చేశారని తెలుస్తోంది.

అంతేకాదు ఈ సన్నివేశం ఆద్యంతం హిలేరియస్ కామెడీ పొట్ట చెక్కలయ్యేలా చేస్తుందట. దీంతో ప్యాచ్ వర్క్ మినహా మొత్తం షెడ్యూల్ పూర్తయినట్టే. నిన్న రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆశక్తికర ఫొటోను షేర్ చేసారు. అనిల్ తన సిస్టర్స్ తో అని తను, సంగీత, రంజిత ఉన్న ఫొటోను పోస్ట్ చేసారు రష్మిక.

మరో పక్క 13 ఏళ్ళ తరువాత విజయశాంతి గారు నిన్నే షూటింగ్ లో పాల్గొన్నారు. ఆవిడకి అనిల్ రావిపూడి, మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సాదర స్వాగతం పలికారు. విజయశాంతి సన్నివేశాలను హైదరాబాద్ నల్సార్ లా కాలేజీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మరి ఆవిడ పాత్రేంటో అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అనిల్ రావిపూడి వారి కాంబినేషన్ ను ఎలా ప్రెజెంట్ చేశాడో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడక తప్పదు. తదుపరి రామోజీ ఫిలింసిటీలో కర్నూల్ సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది. ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు సెట్ వేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇందులోనే ద్వితీయార్థానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. కొండారెడ్డి బురుజు అనగానే అందరికీ ఒక్కడు సినిమానే గుర్తు వస్తుంది.మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత సరిలేరు నీకెవ్వరులో మనం కొండారెడ్డి బురుజు ను చూడబోతున్నాం అనమాట. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్.

సంక్రాంతి 2020 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అందుకు సౌకర్యవంతంగా సినిమాని పూర్తి చేసి ప్రచారానికి ప్లాన్ చేశారు. ఇక మునుముందు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని సంగతులు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ రైలు కూత పెట్టింది మొదలు పరుగే పరుగు అన్నట్లు నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేస్తుంది సరిలేరు నీకెవ్వరు టీమ్.

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment