ఓవర్సీస్ రైట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నికెవ్వరు. భరత్ అనే నేను, మహర్షి సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా గురించి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ఎదురు చూస్తుంది. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ మొదటి సారి ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కర్నూల్ కొండా రెడ్డి బురుజు ముందు చేతిలో గొడ్డలి పట్టుకొని ఆర్మీ ప్యాంటు ధరించిన మహేష్ శత్రువుల మీద దండెత్త దానికి సిద్ధంగా ఉన్న పోస్టర్ ని చూస్తుంటే ఒకప్పటి ఒక్కడు సినిమా గురుస్తోంది అందరికి.

ఇక ఓవర్సీస్ లో మహేష్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓవర్సీస్‌ ప్రేక్షక హృదయాల్లో మహేష్‌కు చాలా గొప్ప స్థానం ఉంది. అమెరికాలో అత్యధిక ఒక మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన హీరోల్లో సౌత్ ఇండియాలోనే మహేష్ ప్రథమ స్థానంలో ఉన్నారు. అలాంటి మహేష్ సినిమా వస్తుందంటే ఓవర్సీస్ లో పండగ వాతావరణం నెలకొంటది.

ఓవర్సీస్ లో పోటీపడి భారీ ధరకు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ మరోసారి మహేష్ సినిమా హక్కుల్ని దక్కించుకుంది. వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గతంలో యూఎస్ఏ లో అతడు, పోకిరి, భరత్ అనే నేను అలాగే మహర్షి వంటి హిట్ సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సంస్థ మళ్ళీ ఇప్పుడు సరిలేరు నికెవ్వరు హక్కుల్ని దక్కించుకుంది.

అమెరికాలో మహేష్ సినిమా ఒక మిలియన్ సాధించడం అనేది చాలా సాధారణ విషయం. ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకున్న సినిమాలు కూడా ఈ జాబితాలో ఉండటం ఓవర్సీస్‌లో మహేష్ క్రేజ్‌ను చెప్పకనే చెబుతున్నాయి. సరిలేరు నికెవ్వరు ఒక మిలియన్ అందుకోవడం చాలా చిన్న విషయం. ఎన్ని మిలియన్లు కలెక్ట్ చేస్తుంది అనే ట్రేడ్ ఎదురుచూస్తుంది.

అమెరికాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 మహేష్ సినిమాలు ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి. టాలీవుడ్‌లోనే కాదు, దక్షిణ భారతదేశంలోని ఏ హీరోకు ఈ రికార్డు లేదు. మహేష్ తర్వాత ఆ స్థానాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ దక్కించుకున్నారు. ఓవర్సీస్‌లో మహేష్ సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది.

అమెరికాలో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లు దాటిన మహేష్ సినిమాలు దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్‌ అనే నేను మరియు మహర్షి. ఈ సినిమాల్లో 1 నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓవర్సీస్‌లో కలెక్షన్లు భారీగా వచ్చాయి.

ప్రస్తుతం సరిలేరు నికెవ్వరు సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు మరో బ్లాక్ బస్టర్అందించడం ఖాయమని సినీ ప్రేమికులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలకాపాత్రలో నటిస్తున్నారు. మహేష్ తో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ యాక్టర్స్ కూడా సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సరిలేరు నికెవ్వరు ఎంతటి ఘనవిజయం సాధించనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఎదురుచూడాల్సిందే.

Share

Leave a Comment