33 ఏళ్లలో ఇదే మొదటిసారి

కశ్మీర్ లో ఆపరేషన్ ముగిసింది. హైదరాబాద్ లో ఆర్మీ ఆపరేషన్ కి రెడీ అవుతోంది సూపర్‌‌స్టార్‌ మహేష్‌ బాబు టీమ్. ఆ మేరకు దర్శకుడు అనీల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. కశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరు తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈనెల 26 నుంచి హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని అనీల్ రావిపూడి తాజా ట్వీట్ లో వెల్లడించారు.

మహేష్ తో పని చేయడం మైండ్ బ్లోయింగ్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ 26వ సినిమా. తొలిసారి ఓ మిలటరీ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనీల్ రావిపూడి ఎంతో జోష్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫన్, రొమాన్స్, దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇన్ని అంశాల మేలు కలయికగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట.

పూర్తి కమర్షియల్ హంగులతో తీస్తున్నా అంతర్లీనంగా ఓ చక్కని సందేశం ఉంటుందని తెలుస్తోంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం నుంచి జగపతి బాబు బయటికి రావడం గత కొద్దీ రోజులుగా హాట్ టాపిక్ గా ఉంది. ఏవో మనస్పర్థలు రావడం వల్లే వదులుకున్నారని అనిల్ రావిపూడితో పొసగలేదని ఇలా ఏవేవో ప్రచారాలు జరిగాయి.

వాటికి వీడియో రూపంలో జగపతి బాబు స్వయంగా చెక్ పెట్టేశారు. దీని గురించి ఆయనొక వీడియో చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సినిమా పరిశ్రమ నా కుటుంబం లాంటిది. నా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టంలేదు. కానీ చిన్న క్లారిటీ ఇవ్వడంలో తప్పులేదు. 33 ఏళ్ల జర్నీలో ఇలా వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి.

అనిల్‌ రావిపూడి, మహేష్‌ బాబు సినిమా నుంచి నేను తప్పుకొన్నాను అని కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో గాసిప్పులొస్తున్నాయి. అది నిజం కాదు. ఇప్పటికీ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్‌ అది. ఆ క్యారెక్టర్‌ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నా. ఆ సినిమా కోసం నేను రెండు సినిమాలు వదులుకున్న మాట నిజం. కొన్ని పరిస్థితుల వల్ల ఇండస్ట్రీలో రకరకాలు జరుగుతుంటాయి.

అవి తప్పవు. ఇది ఏ ఆర్టిస్టుకైనా సహజంగా జరిగేదే కాకపోతే గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నందున చెప్పక తప్పలేదు. అలాంటి కొన్ని కారణాల వల్ల నేను ఆ సినిమాలో లేను. ఆ సినిమాను మిస్‌ అయ్యా. ఆల్‌ ద బెస్ట్‌ టు టీమ్‌ అని ఆయన పేర్కొన్నారు. దీనికి మహేష్ బాబు కూడా స్పందించారు. మీ పై ప్రేమ మరియు గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయి అని మహేష్ ట్వీట్ చేసారు.

దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా ఈ విషయంపై స్పందించారు. సరిలేరు నీకెవ్వరులో ఓ కీలకమైన పాత్ర జగపతిబాబుగారికి నచ్చింది. ఆయన ఇందులో నటించాలనుకున్నారు. కానీ వైదొలగలేదు. కొన్ని కారణాల వల్ల మేమే దాన్ని సాధ్యం చేయలేకపోయాం. జగపతిబాబుగారితో కలిసి మరో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నా.

పరిస్థితుల్ని అర్థం చేసుకుని, స్నేహపూర్వకంగా వ్యవహరించినందుకు మీకు చాలా థ్యాంక్స్‌ సర్‌ అని అనిల్‌ రావిపూడి ట్విటర్‌లో రాసుకొచ్చారు. సరిలేరు నీకెవ్వరు లో మహేష్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. చాన్నాళ్ళ తరువాత విజయశాంతి గారు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.

Share

Leave a Comment