త్వరలో వచ్చేస్తున్నాడు

ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డేకి విదేశాల్లో ఉన్న కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అందుబాటులో లేని సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ త్వరలోనే తిరిగి రానున్నట్టు తెలిసింది. వచ్చిన వెంటనే సరిలేరు నీకెవ్వరు షూట్ లో పాల్గొంటారని సమాచారం.

ఇందుకోసం దర్శకుడు అనిల్ రావిపూడి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని సమాచారం. ముందుగా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ జమ్మూ కాశ్మీర్ పరిసరాల్లో ఈ నెల ఆఖరి వారం నుంచి గాని లేక జులై మొదటి వారం నుంచి ప్రారంభం కానుందట. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణతో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ మొదలవనుందని టాక్.

ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక రెండో షెడ్యూల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అతి తొందరలోనే ప్రారంభం కాబోయే కాశ్మీర్ ఎపిసోడ్లో మహేష్ పైనే ముఖ్యంగా చిత్రీకరణ జరగనుందట. ఈ షెడ్యూల్ తరువాతే మిగతా ప్రముఖ తారాగణం మహేష్ తో జాయిన్ అవ్వనున్నారట. దీని పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇంకా కనీసం సినిమా షూటింగ్ కూడా మొదలు కాకుండానే సరిలేరు నీకెవ్వరు మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. భరత్ అనే నేను-మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్స్ తరువాత ముచ్చటగా ఇంకో హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పటి దాకా తీసిన నాలుగు సినిమాల్లో పరాజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడంతో సహజంగానే హైప్ ఎగబాకుతుంది.

ఇదే అనుకుంటే ఇన్నాళ్లు స్క్రీన్ కు దూరంగా ఉన్న సీనియర్ నటి విజయశాంతి గారు ఈ సినిమాతోనే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వనుండడంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. సినిమాలో ఓ ముఖ్య పాత్రను ఆమె పోషించబోతున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానిపై స్పష్టత అయితే రాలేదు కానీ ఇందులో విజయశాంతి తన మార్క్ చూపించబోతున్నారని, లేకపోతే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఆమె ఈ సినిమా ఎందుకు అంగీకరిస్తారని సినీ ప్రేక్షకుల మాట. ఇంకా ఈ సినిమాలో అనిల్ రావిపూడి ప్రతీ సినిమాలో ఉండే రాజేంద్రప్రసాద్ గారు కూడా నటించనున్నారు.

రీసెంట్ గా ఒక ఫంక్షన్లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు లో రాజేంద్రప్రసాద్ గారి పాత్ర గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’లో ఆయ‌న ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో ఆయ‌న‌కు మంచి స‌న్నివేశాలున్నాయి. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారికి, మ‌హేష్ బాబు గారికి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి’ అని చెప్పారు.

దీంతో ఈ సినిమాలో ఎంటర్‌టైన్మెంట్ కి ఢోకా ఉండదని అప్పుడే ప్రెక్షకులు అంచనాలను పెంచేసుకుంటున్నారు. ఇక సినిమాలో ఇంకో ముఖ్య పాత్రలో జగపతి బాబు గారు కూడా నటిస్తున్నారు. మహేష్ బాబు,జగపతి బాబు లది సూపర్ హిట్ కాబినేషన్. శ్రీమంతుడు, మహర్షి తరువాత మూడోసారి కలిసి నటించనున్నారు. దీని మీద కూడా భారీ అంచనాలు అప్పుడే ఏర్పడ్డాయి.

ఇక సరిలేరు నీకెవ్వరు లో సూపర్ స్టార్ కు జోడీగా రష్మిక మందన్నా కనిపించనున్నారు. మహేష్ తో రష్మిక మందన్నా మొదటి సారి నటిస్తుండడంతో ఈ కొత్త పెయిర్ పై అందరిలోనూ ఆశక్తి నెలకొంది. మహర్షి లానే ఈ సినిమాను కూడా ముగ్గురు నిర్మాతలు దిల్ రాజు, మహేష్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహర్షి తరువాత ఈ సినిమాకు మళ్ళీ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇలా ఇన్ని విశేషాలతో వస్తున్న సరిలేరు నీకెవ్వరు పై ఇంకా షూటింగ్ కూడా మొదలవకుండానే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకధాటిగా షూటింగ్ చేస్తూ 2020 సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ను మన ముందుకు తేవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. నిన్న లండన్ ఓవల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు.

వీరితో పాటు మహర్షి మూవీ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోలను సూపర్ స్టార్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేశారు. ఇది మా అబ్బాయి కోసమే అంటూ ట్వీట్ చేశారు మహేష్. మహేష్ బాబు అక్కడ ఫామిలీతో సహా మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ నిన్న సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

Share

Leave a Comment