విరామం లేకుండా

కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఇప్పుడే స్టార్ట్‌ అవుతున్నాయి కదా అప్పుడే సెలవులు ఏంటీ? అని ఆలోచించకండి. ఇది డెహ్రాడూన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్లిన సినిమా కాలేజీ గురించి చెబుతున్నాం. భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న సినిమా ఇది.

వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి తగ్గట్లే తన 25వ సినిమాకి మహేష్ తన లుక్ ని పూర్తిగా మార్చేశారు. గడ్డం పెంచి, మీసం తిప్పి కెరీర్ లో ముందెన్నడూ చూడని మహేష్ ని చూపిస్తున్నారు.

ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ కాలేదు కానీ సెట్స్ నుండి బయటకి వచ్చిన కొన్ని ఫొటోస్ చూసి మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో ఊహించుకుంటున్నారు అభిమానులు. మహేష్‌బాబు పుస్తకాలు చేతపట్టి కళాశాలకి వెళితే ఎంత బాగుంటుందో ఆ మధ్య శ్రీమంతుడు లో చూశాం.

ఇటీవలే వచ్చిన భరత్‌ అనే నేనులో కూడా బోలెడన్ని డిగ్రీలు తీసుకొంటుంటారు మహేష్. తన 25వ చిత్రం కోసం మరోసారి ఆయన కళాశాలలో అడుగుపెట్టి సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్ లో గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇరవై రోజుల పాటు అక్కడి కాలేజ్ లో మహేష్ స్టూడెంట్ గా కనిపించే సీన్స్ షూటింగ్ పూర్తి చేసారు.

ఇందులో కథానాయికగా నటిస్తున్నారు పూజా హెగ్డే. అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్నారు. మహేష్, పూజా, నరేష్ లపై కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక్కడితో మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. అంటే డెహ్రాడూన్‌ కాలేజీలో క్లాసులు ముగిశాయన్నమాట. విరామం లేకుండా షూటింగ్ చేసిన మహేష్ బాబు 20 రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు.

ఈ ప్రాజెక్ట్ ను దిల్ రాజు, అశ్వనీ దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ యూఎస్‌లో ప్రారంభం అవుతుందా లేక హైదరబాద్‌లో మొదలవనుందా అని ఇంకా అధికారిక సమాచారం రావలసి ఉంది. ఈ చిత్రాన్ని ఉగాది పండగని పురస్కరించుకొని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.

Share

Leave a Comment