పుట్టినరోజున ఆలోచించే మెసేజ్ ఇచ్చిన సూపర్‌స్టార్

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న తన 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో విషెస్ చెప్పారు. అయితే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కాస్త వినూత్నంగా మహేష్ కు బర్త్‌డే విషెస్ తెలిపారు. తెలంగాణ ఐటీ మంత్రి కే.తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కవిత #సిస్టర్స్‌‌ఫర్‌ఛేంజ్‌ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాఖీ పండుగ రోజు అమ్మాయిలు తమ సోదరులకు రాఖీలు కట్టే సందర్భంగా వారికి ఓ హెల్మెట్‌ని బహుమానంగా ఇవ్వాలని ఓ క్యాంపైన్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్యాంపైన్‌కు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన వంతు సహాయాన్ని అందించారు. కవిత తన ట్విటర్‌ ఖాతాలో మహేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌ క్యాంపైన్‌కు బాసటగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహేష్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో మహేష్ మాట్లాడుతూ ‘మన దేశంలో జరిగే యాక్సిడెంట్స్‌లో రోజుకి 28 మంది హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారు. అంటే 28 కుటుంబాలు వాళ్లు ప్రేమించే మనుషులను కోల్పోతున్నారు. జస్ట్ ఒక చిన్న కేర్‌లెస్‌నెస్ వల్ల. ఇట్స్ టైం ఫర్ ఏ ఛేంజ్. ఈ రక్షా బంధన్‌కి మీ అన్నయ్యకి, తమ్ముడికి రాఖీతో పాటు ఓ హెల్మెట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వండి. తప్పకుండా పెట్టుకోమని చెప్పండి. లైఫ్ సేఫ్ ఇజ్ ఏ ఫ్యామిలీ సేఫ్. సిస్టర్స్‌ ఫర్ ఛేంజ్’ అంటూ చెప్పారు సూపర్‌స్టార్.

ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. పుట్టినరోజు నాడు సమాజానికి ఇంత చక్కని సందేశాన్ని ఇచ్చిన సూపర్‌స్టార్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

మహేష్ ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్న వీడియోని కవిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే మహేష్ బాబు గారు. బెస్ట్ విషెస్ మరియు పవిత్రమైన కారణం కోసం ప్రారంభించిన #సిస్టర్స్‌‌ఫర్‌ఛేంజ్‌కి మద్దతు ఇచ్చినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్. ఈ వీడియోని కొంతమందైనా ఆదర్శంగా తీసుకొని హెల్మెట్లు గిఫ్ట్‌గా ఇచ్చి ప్రాణాలు కాపాడుతారని అనుకుంటున్నా’ అని కవిత క్యాప్షన్ పెట్టారు.

కాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన 25వ చిత్రం ‘మహర్షి’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని గురువారం విడుదల చేశారు. కొంత సమయంలోనే ఈ ఫస్ట్‌లుక్, టీజర్‌లు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇందులో సూపర్‌స్టార్ ‘రిషి’ అనే కాలేజ్‌ స్టూడెంట్‌ పాత్రలో కొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నారు. డెహ్రాడూన్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్‌ 12న గోవాలో స్టార్ట్‌ కానుంది.

Share

Leave a Comment