అనుబంధాలకు ప్రతిబింబం..

సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధి వో మా ఊపిరి కన్న కలవో అంటూ ఆ కుటుంబం మేజర్‌ అజయ్‌కృష్ణ గురించి పాడుకుంటున్నారు. అంతలా అజయ్‌కృష్ణ ఏం చేశాడు? వాళ్లకు వచ్చిన ఆపదను ఎలా ఎదుర్కొన్నాడు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సరిలేరు నీకెవ్వరు చూడాల్సిందే.

ఈ రోజు విడుదల చేసిన సెకండ్ సింగిల్ సూర్యుడివో చంద్రుడివో పాట మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అనే చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అద్భుతం. ఇక బి. ప్రాక్ అనే కొత్త సింగర్ తో ఈ పాట పాడించారు. తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసాడనే చెప్పాలి.

కథానాయకుడి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ సాగే పాట ఇది. చాలా తేలికైన పదాలతో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట అందరికీ అర్థమయ్యేలా అందంగా సాగుతోంది. విజువల్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ పాటలో విజయశాంతి, మహేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

దేవుడెక్కడో లేడు, వేరే కొత్తగా రాడు, మంచి మనుషులలో, గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా..ఏ లోక కల్యాణాన్ని ఆశించి జన్మిచ్చిందో నినుకన్న తల్లి కడుపు నిండారా పండింది, నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయహో అన్నది అనే అందమైన పదాలని కూర్చి ఈ పాటను రాసారు శాస్త్రి గారు.

గుండె లోతుల్లో గాయం, నువ్వు తాకితే మాయం, పొలమారే ఆశలు కోసం పొలిమేర దాటొచ్చావు, తలరాతలు వెలుగయ్యేల నేనున్నాన్నవు, అడగందే అక్కరతీర్చే నీ మంచిని పొగడలంటే, నాలో కొలికే మాటలు చాలవు..సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో అంటూ సాగే ఈ పాట ఆద్యంతం మనసుకి హత్తుకునేలా సాగుతుంది.

అచ్చ తెలుగుతనం ఉట్టిపడే పాట, అందుకు తగ్గట్టు సంగీతం, వీటికి పోటీగా చిత్రీకరణ, పచ్చపచ్చని పొలాలు, అన్నింటికీ మించి నటీనటులు, సూర్యుడు చంద్రుడు మిళితమయినట్లున్న మహేష్ బాబు. ఎలా వర్ణించాలి ఈ పాటను, ఇదొక అద్భుతం అంటూ ఈ పాట విన్న నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ముఖ్యంగా విజయశాంతి రీ ఎంట్రీ ఎలా ఉంటుందో అనుకునే వారికి ఈ వీడియో ఒక హింట్‌ను ఇచ్చేసిందనే చెప్పుకోవచ్చు. చక్కని చీర కట్టులో, ముగ్గు వేస్తూ, మహేష్‌కు మార్గం చూపుతూ, మహేష్ బైక్‌పై కూర్చుని సంభాషిస్తూ, ఫ్యామిలీ మొత్తంతో కలిసి టూర్ ఇలా అన్ని కోణాల్లో విజయశాంతి ఈ పాట స్థాయిని పెంచారు.

మహేష్‌ కు మార్గదర్శి వంటి స్థానంలో ఆమె ఈ చిత్రంలో నటించినట్లుగా పాట చూస్తుంటే తెలుస్తుంది. మహేష్, విజయశాంతిలను అలా చూస్తుంటే.. రెండు కళ్లూ చాలవేమో అన్నట్లుగా కెమెరామెన్ రత్నవేలు తగిన మూడ్‌, కలరింగ్‌ను క్రియేట్ చేశారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు దేవిశ్రీ ఈ పాటతో మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేశారు.

ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. సూపర్‌ స్టార్‌ ఫాన్స్‌కి ఫీస్ట్‌ గా సంక్రాంతి ఎంటర్టైనర్‌ సరిలేరు నీకెవ్వరు ఉండబోతోంది అని తెలుస్తోంది.

దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా తెరకెక్కిస్తున్న ఈ మాస్‌ ఎంటర్టైనర్‌లో మహేష్‌ క్యారక్టరైజెషన్‌, కామెడీ టైమింగ్‌ హైలైట్స్‌గా ఉండనున్నాయి. జనవరి 11, 2020 న ప్రపంచవ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే క్యూరియాసిటీ నెలకొంది.

Share

Leave a Comment