వైఎస్ జగన్ కు మహేష్ సర్‌ప్రైజ్

భారీ ఉత్కంఠ నడుమ నిన్న (గురువారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మెహన్ రెడ్టి ఊహించని మెజారిటీతో భారీ విజయం సాధించారు. పోటీ చేసిన మొత్తం స్థానాల్లో ముప్పావు వంతు స్థానాలను చేజిక్కించుకున్నారు. ఈ విజయం ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గద్దెదింపి ఏపీ కొత్త సీఎంగా అవతరించబోతున్నారు వైఎస్ జగన్.

మరోవైపు దేశంలో బీజేపీ హవా కొనసాగింది. మళ్లీ మోదీనే ప్రధాని కావాలని కోరుకున్నారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ప్రధాని మోడీకి ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారి విజయంపై స్పందించగా తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు తనదైన కోణంలో స్పందిస్తూ ట్వీట్ చేశారు.

ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మీ పాలనలో రాష్ట్రం అత్యున్నత శిఖరాలు అందుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మనసార ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు మహేష్. కేంద్రంలో ఘనవిజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు మహేష్ బాబు.

‘మోదీజీ మీ విజయానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో దేశం ఇలాగే ఎంతో కాంతి వంతంగా ముందుకెళ్లాలని కోరుతున్నా’ అని మరో ట్వీట్ చేశారు మహేష్. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సంచలన విజయాన్ని అందుకున్నారు. ఏకంగా 151 సీట్లతో ప్రత్యర్థులకు అందనంత మెజార్టీని సాధించారు.

మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను’లో యంగ్ సీఎంగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా పోలీషియన్స్‌కి మంచి సందేశమిచ్చారు. దీంతో రియల్ యంగ్ సీఎం జగన్‌కి రీల్ యంగ్ సీఎం శుభాకాంక్షలు అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఎవరు ఎటువంటి విజయాన్ని అందుకున్నా, వారికి తన వంతుగా అభినందనలు తెల్పడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్.

ఇక మహేష్ నటించిన తాజా సినిమా మహర్షి విజయవంతంగా ప్రదర్శించబడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది. మే 9 వ తేదీన విడుదలైన మహర్షి ఇప్పటికీ కూడా చాలా ఏరియాల్లో అసలు డ్రాప్స్ అనేవి లేకుండా మంచి జోరు మీద దూసుకుపోతోంది. చిత్రంలో మహేష్ నటన, సామాజిక అంశాల పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారంతా.

విడుదలకు ముందు నుంచే టీజర్, ట్రైలర్ లతో భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న మహర్షి విడుదల తర్వాత ఆ అంచనాలను మించి పరుగులు పెడుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో మహర్షి సక్సెస్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మహర్షి విడుదల తరవాత ప్రొమోషన్ లతో బిజీ అయిపోయిన మహేష్ బాగా అలసిపోయారు.

అందుకే, ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి హాలీడేకు వెళ్ళారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూనే ఉంటారు మన సూపర్ స్టార్. మహేష్ బాబు ఒక ఫ్యామిలీ మ్యాన్. మహేష్ తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో ఫ్యామిలీ టైం ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక మరోవైపు అయన నటించబోయే నూతన చిత్రనికి సంబంధించి అప్పుడే అన్ని పనులు ప్రారంభమయ్యాయి. అయన విదేశాల నుండి తిరిగి రాగానే అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు.

ఒక సారి సినిమా సెట్స్ పైకి వెళితే వెంటనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వేగంగా పూర్తవుతోంది. కాస్టింగ్ సెలక్షన్స్ లోనూ దర్శకుడు అనీల్ రావిపూడి, అనీల్ సుంకర బృందం బిజీగా ఉన్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను బరిలో ఉంచాలనేది చిత్ర యూనిట్ ప్లాన్.

Share

Leave a Comment