ఎదురుచూస్తున్నా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డి. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది.

అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం విడుదల చేశారు. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ చిత్ర ట్రైలర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.

అసాధారణమైన విజువల్స్. ట్రైలర్ యొక్క ప్రతి ఫ్రేమ్‌లో ఈ చిత్రం యొక్క గొప్పతనం స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవిగారు సూపర్బ్. అమితాబచ్చన్‌గారు, రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, రత్నవేలు మరియు చిత్రయూనిట్ మొత్తం గొప్ప ప్రయత్నం చేశారు. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా అని మహేష్ బాబు తన ట్వీట్‌లో తెలిపారు.

సైరా సినిమా గురించి ట్వీట్ చేయడం ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు అనే చెప్పాలి. మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ పై వెంటనే మెగాస్టార్ అభిమానులు స్పందించారు. మహేష్ బాబుకు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా మెస్సేజ్ పెట్టారు. దీంతో ఇటు సూపర్ స్టార్ అభిమానులు, అటు మెగా అభిమానులు ఈ ట్వీట్స్ చూసి మురిసిపోతున్నారు.

ఈ నెలలోనే తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన వేడుకకి సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సాధారణంగా చిరంజీవి, మ‌హేష్ ఇద్దరూ కలిసి ఒకే వేడుక‌లో క‌న‌ప‌డ‌టం చాలా చాలా అరుదుగా చూశాం. అలాంటి అరుదైన సందర్భం ఆ వేడుకలో కనిపించడంతో కెమెరా కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే పడ్డాయి.

చిరంజీవి, మ‌హేష్ లు క‌లిసి కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ అరుదైన కలయిక చుసిన ఇరువురి అభిమానులు ఖుషీ అవుతూ అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేసుకున్నారు. చిరు అంటే ఎప్పుడైనా సరే ప్రేమాభిమానం చూపించే ప్రిన్స్ దాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఆ వేడుకలో కూడా వదులుకోలేదు.

చిరంజీవి గారితో మాట్లాడుతుంటే ఒక రకమైన కొత్త ఎనర్జీ వస్తుందని మరోసారి ఈ సందర్భంగా దాన్ని ఆస్వాదించానని మహేష్ చెప్పడంతో స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది. తన ప్రసంగాన్ని ఈ మాటలతోనే మొదలుపెట్టిన మహేష్ ఆపై మరింత కిక్ ఇచ్చేలా సైరా ప్రస్తావన తీసుకొచ్చారు. సైరా టీజర్ చూశానని నమ్మశక్యంగా లేదని అన్నారు.

అలాంటి విజువల్ వండర్ ని అందరితో పాటు తనకూ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఉందని ప్రకటించడంతో ఈలలు మాములుగా వినిపించలేదు. మహేష్ మాటలు వింటూ చిరంజీవి థాంక్యూ అనటం ఆ ఈవెంట్ కే హైలైట్. చిరంజీవి కుటుంబానికి మహేష్ కు చాలా మంచి అనుబంధం ఉంది. చిరంజీవి అంటే ఎప్పుడూ అభిమానం చూపిస్తారు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ 26వ చిత్రమిది. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా సరిలేరు నీకెవ్వరు సినిమాను నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Share

Leave a Comment