పెద్దోడు చిన్నోడు కలిసి…?

మ‌న సినీ తార‌ల‌తో పాటు మ‌రికొంత సెల‌బ్రిటీలు జూన్ నెల‌లో ఇంగ్లాండ్ వెళుతున్నారు. అది కూడా అంద‌రూ ఒకే సారి వెళుతుండ‌టం కొస‌మెరుపు. ఇంత‌కు అంద‌రూ ఒకేసారి ఇంగ్లాండ్‌కు ఎందుకు వెళుతున్నారు అనే సందేహం రాక మాన‌దు. కార‌ణ‌మేంటో తెలుసా మే 30న ప్రారంభం కాబోయే క్రికెట్ ప్రపంచ క‌ప్‌ను వీక్షించ‌డానికి.

టాలీవుడ్ లో క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే వాళ్ళు ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఇండియా కానీ సన్ రైజర్స్ కాని మ్యాచులు ఎప్పుడు ఎక్కడ జరిగినా అక్కడ మనమందరం వెంకీ ని చూడవచ్చు. మహేష్ బాబుకి సైతం క్రికెట్ అంటే ఇష్టమే. కానీ తనకు క్రికెట్ పై ఉండే ఇష్టాన్ని ఇలా ప్రదర్శించడం చాలా తక్కువ.

మహర్షి ప్రీ రిలీజ్ లో సినిమా సక్సెస్ ని వరల్డ్ కప్ ఫైనల్ లో ధోని సిక్స్ తో పోల్చి ఆట మీద ఇష్టాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ‘నేను క్రికెట్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు వెళ్లాను. చివ‌ర్లో దోని సిక్స్ కొట్టిన‌ప్పుడు చాలా సంతోష‌ప‌డ్డాను. అప్పుడు ఎంత ఆనందం వేసిందో ఇప్పుడు అంతే ఆనందం వేసింది’ అని అన్నారు మహేష్.

ఈ ఇద్దరూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో అన్నదమ్ములుగా కలిసి చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో పాత్ర పేర్లు పెద్దొడు చిన్నోడుగా జనంలో బాగా రిజిస్టర్ అయిపోయాయి. ఆ సినిమా నుంచి వీరిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు అయిపోయారు. ఇప్పుడు త్వరలో యుకెలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కోసం ఇండియా మ్యాచులు చూసేందుకు ఇద్దరూ వెళ్లనున్నట్టు తెలిసింది.

నిర్మాత సురేష్ బాబు కూడా ఈ బృందంలో ఉంటారట. చాముండేశ్వ‌ర‌నాథ్ నేతృత్వంలో డి.సురేష్‌బాబు, డా.కామినేని శ్రీనివాస్‌, ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, చంద్ర‌కుమార్‌ల‌తో స‌హా విక్ట‌రీ వెంక‌టేష్, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఇంగ్లాండ్ వెళుతున్నారు అని సమాచారం. జూన్ 9, జూన్ 13, జూన్ 16 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్ దేశాల‌తో ఇండియా మ్యాచ్‌లు ఆడ‌నుంది.

లీగ్ మ్యాచులు చూసి సెమీస్ చేరితే కనక టూరును కొనసాగిస్తారు. దానికి అనుగుణంగా వెంకటేష్ తన వెంకీ మామ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారట. ఎలాగూ మహేష్ ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. అనిల్ రావిపూడి సినిమా మొదలుపెట్టడానికి కొంత టైం ఉంది కాబట్టి హ్యాపీగా మ్యాచులు ఎంజాయ్ చేయొచ్చు. సో త్వరలో క్రికెట్ గ్రౌండ్ లో చిన్నోడు పెద్దోడు కలిసి ఇండియా టీమ్ కి జోష్ ఇవ్వడాన్ని మనం చూడొచ్చు అనమాట.

దీని పై అధికారిక సమాచారం ఇంకా అందవలసి ఉంది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మహర్షిలో చర్చించిన రైతు సమస్యలు, వీకెండ్ వ్యవసాయం వంటి వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

రికార్డులతో పాటు ప్రజల్లో ఆలోచనను కూడా రేకెత్తించాడు మహర్షి. ఈ నేపథ్యంలో ‘మహర్షి’ గ్రాండ్ సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి సిద్ధార్థ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ దీనికి వేదిక కాబోతోంది. మే 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు మహర్షి టీమ్ మొత్తం హాజరు కాబోతున్నారు.

మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే, అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ ల తో పాటు మహర్షి సినిమా కు పని చేసిన వారందరూ ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు అభిమానులు భారీ సంఖ్యలో తరలి రాబోతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఈవెంట్ తో ఇక మహేష్ తన మహర్షి ప్రమోషన్ లకు బ్రేక్ ఇస్తాడు అనుకుంట. ఇక ఎలాగో తన తదుపరి అనిల్ రావిపూడి సినిమా మొదలవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. దీంతో ఈ విరామంలో ఈ వరల్డ్ కప్ వెకేషన్ కు ప్లాన్ చేసారని టాక్. ఇది నిజమో కాదో ఇంకో వారంలో మనకు తెలిసిపోతుంది.

బుధవారంతో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 59.37 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసినట్లయింది. బాహుబలి, బాహుబలి 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో మంచి వసూళ్లు సాధిస్తోంది.

మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను’ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద మహర్షి జోరు చూస్తుంటే ఫుల్ ర‌న్‌లో ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని, చాలామంది వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకుని, పొలాల బాట పడుతున్నారు. వీకెండ్ వ్యవసాయం పేరుతో జాబ్ చేస్తున్నవాళ్ళు సైతం సేద్యానికి సై అంటున్నారు.

Share

Leave a Comment