ప్రత్యేక స్థానం..!!

తెలుగు సినిమాను ఇప్పుడు ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్తున్న హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు ది చాలా ప్రత్యేక స్థానం. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీసు గలగలలాడాల్సిందే. వినూత్నమైన కథలతో ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రాకుమారుడు మహేష్‌బాబు.

1999లో రాజకుమారుడుతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ రెండో సినిమా యువరాజుతో వయసుకు మించి బరువైన పాత్ర చేసి అప్పుడే తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసారు. మురారితో తానేంటో చాటిన మహేష్ ఇక అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.

టక్కరి దొంగ లాంటి కౌ బాయ్ ఎక్స్ పరిమెంట్స్, ఒక్కడు లాంటి కమర్షియల్ వండర్స్, పోకిరి లాంటి ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ వరసబెట్టి అందుకుని మార్కెట్ తో పాటు అభిమానుల సంఖ్యను అంతకంతా పెంచుకుంటూ పోయాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మహేష్‌ అంటే అందరికీ ఎంతో అభిమానం.

సినిమా సినిమాకు తనను మరింత సానబెట్టుకుంటూ ప్రయోగాత్మక కథలతోనే అటు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే బాక్సాఫీసును షేక్ చేయడం మహేష్ నైజం. నాలుగేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా నీడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ 1983లో వచ్చిన పోరాటం సినిమాలో తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించి మెప్పించారు.

తర్వాత బాలనటుడిగా శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడఛారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాల్లో నటించి మెప్పించారు. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాట మెసేజ్ ను జోడించి మహేష్ గత రెండేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ త్రీ హండ్రెడ్ క్రోర్ మూవీస్ తన ఖాతాలో వేసుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటుడిగా బుడిబుడి అడుగులు వేస్తున్న టైంలోనే తనకంటూ ఒక స్టార్ డం క్రియేట్ చేసుకున్న మహేష్ ఇప్పుడీ స్థాయికి రావడంలో తన కృషితో పాటు సబ్జెక్ట్ సెలక్షన్ లో తన చూపించే వేరియేషన్స్ అనే చెప్పి తీరాలి. సినిమా పరిశ్రమలో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు సినీతారలు కూడా మెచ్చిన నటుడు.

వివాద రహితుడిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న, మంచి మనసున్న స్టార్‌గా ఆయన ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేశారు. సమాజహితం కోరే సినిమాలు చేస్తూ, పలు అంశాల్లో సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ మార్పులో తాను భాగం అవుతూ, అభిమానులను, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మహేష్ బాబు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద దూకుడుకు మరో పేరు. ఈ పేరు వినగానే ఎన్నో రికార్డులు, మరెన్నో విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి. ఇటు క్లాస్, అటు మాస్ మరోవైపు ప్రయోగాలతో వయసు, బేధం లేకుండా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఘనత మహేష్ బాబుది.

తండ్రిని మించిన తనయుడిగా రాజకుమారుడుగా అభిమానులు గర్వపడేలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు ఈ మహర్షి. గ్రామాలను దత్తత తీసుకుని శ్రీమంతుడుగా మారి ఆ గ్రామ అభివృద్ధికి తనదైన సామాజిక బాధ్యతను నెరవేస్తున్నాడు. ఎంతో మంది చిన్నారులకి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాడు.

ఇక వీటితో పాటు మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ పలువురి ప్రాణాలు కాపాడి వారి కుటుంబాల్లో ఒక్కడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ముఖ్యంగా పిల్లలను క్రమశిక్షణతో పెంచుతూ సరిలేరు నీకెవ్వరుగా వెలుగొందుతున్నాడు ఈ పోకిరి.

Share

Leave a Comment