నందమూరి కుటుంబాన్ని పరామర్శించిన మహేష్

నటుడు, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ గారు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హరికృష్ణ గారి మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరు అయ్యారు. నందమూరి హరికృష్ణ గారి మరణం సినీ రాజకీయ రంగాలకి తీరని లోటు మిగిల్చింది.

ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి తమ సంతాపాన్ని తెలియజేశారు. శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు నందమూరి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు మహేష్ హైదరాబాద్ లో లేరు. నిన్ననే ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. దీంతో నిన్న ఆయన నందమూరి కుటుంబాన్ని పరామర్శించారు.

నిన్న మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో మెహిదీపట్నం, ఎన్‌ఎండీసీ సమీపంలోని నందమూరి హరికృష్ణ గారి నివాసానికి వెళ్లిన మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ మృతిపై సానుభూతి తెలిపారు. మహేష్‌ బాబు దాదాపు గంటసేపు నందమూరి కుటుంబ సభ్యులతో గడిపారు.

తన అభిమాని వివాహానికి హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున కారులో హరికృష్ణ బయలుదేరిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లాలో కారు డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురికావడంతో హరికృష్ణ గారు చనిపోగా, కారులోనే ఉన్న ఇద్దరు మిత్రులు ప్రాణాలతో బయటపడ్డారు. నందమూరి హరికృష్ణ గారి మరణం నుంచి తేరుకోకముందే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ దర్శకురాలు బి.జయ గారు గురువారం రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జయ గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. మహేష్ సతీసమేతంగా బి.జయ గారి బౌతికకాయానికి నివాళులు అర్పించారు. మహేష్, నమ్రత ల తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా వచ్చారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ కోసం దాదాపు రెండు నెలల పాటు అమెరికాలోనే గడపబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి’ షూటింగ్ 60 రోజులకు పైగా భారీ షెడ్యూల్ యూఎస్ఏలో జరుగబోతోందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తర్వాతి షెడ్యూల్ న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ తదితర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో యూఎస్ఏ షెడ్యూల్ ప్రారంభం కాబోతోందట.

Share

Leave a Comment