నలుగురితో పంచుకుంటే ఆనందమే వేరు

అభిమానం అనే ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. జీవితంలో కొంతైనా ఇతరులకు సహాయపడితే ఓ చిన్న ఆనందం. మన ఇంట్లో పండగ వస్తే నలుగురితో పంచుకుంటే ఆ ఆనందమే వేరు. సేవా కార్యక్రమాల్లో, విరాళాలు ఇవ్వడంలో ఎప్పుడు ముందుడే మహేష్ – నమ్రత దంపతులు వారి పెళ్లి రోజు సందర్భంగా తమ ఆనందాన్ని దివ్యాంగుల పాఠశాల పిల్లలతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా 650 మంది అంధ బాలలకు ఈ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బాలలంతా మహేష్, నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమకు అన్నదానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

సాధారణంగా సెలబ్రిటీల పుట్టినరోజు, పెళ్లిరోజు సెలబ్రేషన్స్ అంటే ఫారన్ టూర్లు, రిసార్టుల్లో ఎంజాయ్‌మెంట్లు, హాలీడే టూర్లు ఉంటాయి. బంధుమిత్రులు, సన్నిహితులతో పార్టీలు ఉంటాయి. కానీ, మహేష్-నమ్రత దంపతులు అలా కాదు. సరదాలకు, పార్టీలకు ఎప్పుడూ దూరంగా ఉండే అనాథ, అంధ బాలలను కనీసం ఈరోజైనా సంతోష పెట్టాలనే ఆలోచన.

అందుకే తమ పెళ్లిరోజు నాడు 650 మంది బాలలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చిన్నారుల ఆకలిని తీర్చి మరోసారి బెస్ట్ కపుల్స్ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చుసిన అభిమానులు నమ్రత మహేష్ లు అంటే అందుకే అంత ఇష్టమని కామెంట్ చేస్తున్నారు.

ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. భార్య నమ్రతా శిరోద్కర్ సారథ్యంలో ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. వీరిద్దరూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

గచ్చిబౌలిలో ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్‌లో అనాథ పిల్లల కోసం మొన్నామధ్య ‘స్పైడర్ మ్యాన్’ సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. నమ్రత స్వయంగా దగ్గరుండి విడుదలకు ఒక్క రోజు ముందే ఈ చిత్రాన్ని అనాథ పిల్లలకు చూపించారు. ఇప్పుడు తమ పెళ్లిరోజు సందర్భంగా మహేష్, నమ్రత దంపతులు అంధ బాలలకు ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.

ఇటువంటి మంచి మనసుతో తమ వంతు సేవ చేస్తోన్న మహేష్ – నమ్రత దంపతుల జంట ఎప్పటికి ఇలా సంతోషంగా ఉండాలని, వారిది ఎంతో మంచి మనసంటూ వారి తరహాలో విషెష్ అందిస్తున్నారు. కేవలం అభిమానులే కాకుండా సాటి మనిషి పట్ల సేవా గుణం చూపించే ప్రతి ఒక్కరు మహేష్ దంపతుల భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని కోరుకుందాం.

పెళ్లి రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత గారు మనకి తెలియని ఎన్నో విశేషాలను తెలియజేసారు. “ముందు నేనే మహేష్‌కు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాను. మహేష్ కూడా అప్పటికే నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరి గురించి మరొకరికి అవగాహన ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాం” అంటూ తెలిపారు.

పెళ్లి తర్వాత నటించడం తనకే ఇష్టంలేక నటించలేదని వెల్లడించారు. నటన టేకప్ చేస్తే కుటుంబానికి కెరీర్‌ రెండీటికీ న్యాయం చేయలేననుకున్నాను అందుకే నటనకు స్వస్తి చెప్పానని వివరించారు. అందుకే అప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి తర్వాత నుండి సినిమాలకు దూరం అయ్యానని తెలిపారు.

భర్తగా మహేష్‌కు 10 కి 10 మార్కులు వేస్తానని తెలిపారు. మహేష్ పిల్లల్ని చెడగొడతారు. నేను స్ట్రిక్ట్‌గా ఉంటాను. సో… వాళ్ళకు విలన్‌ నేనే.. అని నవ్వేసారు. తనపై ఎప్పుడూ పిల్లలు మహేష్‌కు కంప్లైంట్ చేస్తారని పేర్కొన్నారు. వాళ్ళకు ఏదైనా కావాలనుకుంటే నాన్న దగ్గరకు వెళ్ళి అడుగుతారు. పిల్లలిద్దరూ నాన్న కుచీలే అని అన్నారు.

తన జీవితంలోకి నమ్రత వచ్చిన తర్వాత మరింత సంతోషం తన జీవితం లోకి వచ్చినట్లయిందని మహేష్ తరచూ చెబుతుంటారు. ఈ ఇద్ద‌రి ప్రేమ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. అభిమానులే అని కాకుండా కుటుంబం అంటే ప్రేమ ఉండే ప్రతీ వ్యక్తి ఈయ‌న్నే ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. భార్యాభ‌ర్త‌లు అంటే ఇలానే ఉండాలి అంటూ వాళ్ల‌ను చూపిస్తున్నారు.

ఇన్నేళ్ల‌లో ఈ జంట‌పై ఒక్క‌సారి కూడా ఏ చిన్నపాటి రూమ‌ర్ రాలేదంటే వాళ్ల దాంప‌త్యం ఎలా సాగుతుందో, ఒకరికొకరు కలిసి ఎంత సంతోషంగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. వీరివురు ఒకరికోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. ఈ ఇద్ద‌రూ టాలీవుడ్ బెస్ట్ క‌పుల్స్ లో ఒక‌రిగా నిలిచిపోయారు.

Share

Leave a Comment