ఇదే తొలి సినిమా అనిపించింది (Mahesh Speech Video)

mahesh-babu-telugu-spyder-

ఈ సినిమాతో నువ్వు తమిళంలో అడుగుపెడుతున్నావ్‌ కదా అని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. నిజానికి సినిమాల్లోకే తొలిసారి అడుగుపెడుతున్నంత ఉద్వేగంగా ఉంద’’న్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్పైడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. హారీశ్‌ జయరాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు శనివారం రాత్రి చెన్నైలో విడుదలయ్యాయి. తొలి సీడీని పీటర్‌ హెయిన్స్‌ సతీమణి పార్వతి, ఏఆర్‌ మురుగదాస్‌ భార్య రమ్య, హారీశ్‌ జయరాజ్‌ అర్ధాంగి సుమ సంయుక్తంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడుతూ ‘‘‘పద్దెనిమిదేళ్ల కెరీర్‌లో ‘స్పైడర్‌’ ఓ కొత్త అనుభూతి ఇచ్చింది. తొలి సినిమా చేస్తున్నానేమో అనిపిస్తోంది. మురుగదాస్‌తో సినిమా అనేది పదేళ్ల కల. చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకొన్నాం. ఓసారి ఆయన ఇంటికొచ్చి కథ కూడా వినిపించారు. అప్పుడు ఏ కథైతే చెప్పారో, ఇప్పుడు అదే కథని తెరకెక్కించారు. రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. అంత స్థాయిలో సినిమాని నిర్మించడానికి కూడా గట్స్‌ ఉండాలి. ఈ విషయంలో నిర్మాతల్ని అభినందిస్తున్నా. హారీస్‌ సంగీతం, పీటర్‌ హెయిన్స్‌ ఫైటింగులు ప్రధాన బలం. పదేళ్ల క్రితం ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో ‘నాని’ సినిమా చేశా. ఆ సినిమా చేశాక కూడా మామధ్య దర్శకుడు, నటుడు అనే బంధం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ చిత్రంలో హీరో – విలన్‌గా నటించాం. క్లైమాక్స్‌లో ఇద్దరం ఒకరిని ఒకరు పగతో చూసుకొనే సన్నివేశాలు చూస్తే… నవ్వొచ్చేసింది. ఫలానా సినిమా చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నాకన్నీ మంచి అవకాశాలే వచ్చాయి. ‘తుపాకి’ మాత్రం తెలుగులో రీమేక్‌ చేయాలనిపించింది. అప్పట్లో కుదర్లేదు. నా కెరీర్‌లోనే బాగా నచ్చి చేసిన సినిమా ఇది. తెలుగు రాష్ట్రాలలో వూహించని స్థాయిలో అభిమానుల్ని ఇచ్చాడు దేవుడు. ఈ జన్మకు ఇది సరిపోతుంది. నా సినిమాల్లో అత్యుత్తమం ఏదని అడిగితే ‘స్పైడర్‌’ పేరే చెబుతా’’ అన్నారు మహేష్‌.

మురుగదాస్‌ మాట్లాడుతూ ‘‘విజయవాడలో ‘ఒక్కడు’ సినిమా చూసినప్పుడే మహేష్‌తో సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. అప్పట్లో మహేష్‌తో ‘గజిని’ని రీమేక్‌ చేద్దామనిపించింది. ‘తుపాకి’ కూడా మహేష్‌తో చేయాలనిపించింది. కొన్ని కారణాల వల్ల డబ్బింగ్‌ సినిమాలే రిలీజ్‌ అయ్యాయి. రెండు భాషల్లో ‘స్పైడర్‌’ చేయడం చాలా పెద్ద బాధ్యత అనిపించింది. ప్రతీ షాట్‌నీ తెలుగు, తమిళంలో విడి విడిగా చేశాం. అంతటి కష్టాన్ని కూడా మహేష్‌ ఓర్చుకొని పూర్తి చేశారు. నేనేం ముఖస్తుతి కోసం చెప్పడం లేదు. నాకు ఆ అవసరం కూడా లేదు. ‘డేట్లు ఇంకా కావాలన్నా తీసుకోండి..’ అని ‘గజిని’ సమయంలో ఆమీర్‌ ఖాన్‌ చెప్పారు. ఆ తరవాత అలా చెప్పింది మహేషే. ఈ సినిమా చేయడం మహేష్‌కే సాధ్యమైంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ క్రెడిట్‌ కచ్చితంగా మహేష్‌కే దక్కుతుంది. ఈనెల 15న ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. అందులో క్లిప్పింగ్స్‌ చూస్తే పీటర్‌ హెయిన్స్‌ శ్రమ తెలుసు కుంటారు. ఒక్కో యాక్షన్‌ ఎపిసోడ్‌లో సుమారు 2 వేల మంది కనిపిస్తారు’’ అన్నారు.

ప్రతినాయకుడిగా కనిపించిన సూర్య చెబుతూ ‘‘రజనీకాంత్‌కి ‘చంద్రముఖి’లా, మహేష్‌కి ‘స్పైడర్‌’ పేరు తెస్తుంది. మా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తెలుగు సూపర్‌ స్టార్‌కి ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ‘స్పైడర్‌’లో మహేష్‌ని ఓ హాలీవుడ్‌ హీరోగా చూస్తార’’న్నారు. ‘‘మహేష్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని నా కోరిక. అది ఈ సినిమాతో తీరింది. సంతోష్‌ శివన్‌ నన్ను మరింత అందంగా చూపించార’’ంది రకుల్‌.

విశాల్‌ మాట్లాడుతూ ‘‘మహేష్‌ ఇక మా కుర్రాడు.. ఆయన మా హీరో.. మహేష్‌ నటించిన సినిమాలన్నీ తొలి రోజు, తొలి షో చూడడం అలవాటు. ఈ సినిమాని కూడా తెలుగు అభిమానుల మధ్య కూర్చుని చూస్తా’’నన్నారు. దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ ‘‘మహేష్‌ వీరాభిమానిని. ‘మద్రాసు పట్టణం’ కథని మహేష్‌బాబు కోసమే రాసుకొన్నా. ఏదో ఒకరోజు ఆయనతో తప్పకుండా చేస్తా’’ అన్నారు.

హరీశ్‌ జయరాజ్‌ చెబుతూ ‘‘ఈ సినిమాకి ఆర్‌.ఆర్‌ చేసేటప్పుడు ఆశ్చర్యపోయా. నాతో పాటు ప్రతి మహేష్‌ అభిమాని ఒకటికి పదిసార్లు చూస్తారు. ఓ హాలీవుడ్‌ హీరో మీ కంటికి కనిపిస్తార’’న్నారు. ఈ కార్యక్రమంలో విక్రమన్‌, కేఆర్‌, దాను, ఏఎం రత్నం, ఆర్‌బి చౌదరి, సుభాస్కరన్‌, రాజు మహాలింగం, కరుణాకరన్‌, మెహర్‌ రమేష్‌, శ్రీకర్‌ ప్రసాద్‌, రామజోగయ్యశాస్త్రి, మదన్‌కార్కీ తదితరులు పాల్గొన్నారు.

Share

Leave a Comment