మహేష్ మద్దతు..!!

కేవలం సినిమాలే కాదు మా లో సమాజ స్పృహ కూడా ఉంది అని నిరూపిస్తూ వస్తున్నారు నేటితరం హీరో హీరోయిన్లు. చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో టాలీవుడ్, కోలీవుడ్ నుంచి చాలా మంది హీరోహీరోయిన్లు ఉన్నారు. సామాజిక కోణంలో ఆలోచిస్తూ సమాజ హితం కోసం తమ వంతు సహకారం అందిస్తున్నారు సదరు తారలు.

ఈ కోణంలోనే ఓ విషయమై మహేష్ బాబు, ప్రభాస్ తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా స్పందించి ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది దోమల నివారణకు, పరిశుభత్రకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ పొలిటిషన్.. ఈ కార్యక్రమంలో అందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఇటీవల తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ..

‘వైరల్ జ్వరాలు, డెంగీ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాను. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి’ అని కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

అయితే మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచ‌న‌ల‌కు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్‌మీడియా వేదికగా మ‌ద్ద‌తు తెలియ‌జేశారు. హైదరాబాద్ నగర పౌరులకు జాగ్రత్తలు వివరిస్తుస్తూ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేసాడు… మహేష్ ట్వీట్ చేయడంతో కొద్ది సేపట్లోనే ఈ విషయం ట్రెండింగ్ లోకి వెల్లిపోయింది.

‘డెంగీ, వైరల్‌ జ్వరాలు ప్రస్తుతం నగరంలో వ్యాపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి నిల్వ లేకుండా పరి శుభ్రంగా చూసుకోండి. అందరూ అప్రమత్తంగా ఉండడంతోపాటు మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి హైదరాబాద్‌ నగరవాసులరా..’ అంటూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రానున్న సరిలేరు నీకెవ్వరు అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దర్శకనిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. మహేష్ 25వ సినిమా మహర్షిని బీట్ చేసేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీకి కొదవ ఉండదు. ఈ సారి ఇంకా భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం. కామెడీ తో పాటుగా అన్ని అంశాలు ఉండేటట్లు అనిల్ రావిపూడి జాగ్రత్త వహిస్తున్నారట. మహేష్ బాబును పవర్ ఫుల్ రోల్‌లో చూపిస్తూనే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి.

మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా కొన్ని పోరాట ఘట్టాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీన్స్ చిత్రంలో హైలైట్ కానున్నాయని అంటున్నారు.

మహేష్ బాబు సరసన రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్నారు. ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు విజయశాంతి. రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో అలరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ఎలాంటి బ్లాక్‌బస్టర్ గా నిలవనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Share

Leave a Comment