సూపర్‌స్టార్‌ కంటే సినిమాయే గొప్పది – మహేష్‌బాబు

మహేష్‌బాబు నటించాల్సిన పని లేదు. చిన్నగా నవ్వినా అభిమానులకు ఓ సూపర్‌ హిట్‌ సినిమా చూసినంత సంబరంగా ఉంటుంది. అమ్మాయిల అందాన్నంతా ఓ అబ్బాయికే దేవుడు పొట్లం కట్టి ఇచ్చేస్తే, హాలీవుడ్‌ కొలతలతో టాలీవుడ్‌లో ఓ హీరో తిరిగేస్తే… అది మహేష్‌బాబే. మహేష్‌ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రతిసారీ వెండితెరపై తన హీరోయిజాన్ని చిరునవ్వులతోనే పండిస్తున్నాడు శ్రీమంతుడిలా!

స్పైడర్‌ సంగతులు…

maheshbabu-interview-1-spyder

‘స్పైడర్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా మరో సినిమా హడావుడిలో పడిపోయారు. గ్యాప్‌ తీసుకోవాలని అనిపించలేదా?

నిజానికి ‘స్పైడర్‌’ తరవాత కనీసం పదిహేను రోజులు విరామం తీసుకొందాం అనిపించింది. కానీ అనుకోని కారణాల వల్ల ‘స్పైడర్‌’ కాస్త ఆలస్యమైంది. ఈ కొత్త సినిమాల షెడ్యూళ్లన్నీ ముందే ఫిక్సయిపోయాయి. అందుకే విరామాన్ని పక్కన పెట్టా.

మిమ్మల్ని జేమ్స్‌ బాండ్‌ తరహా పాత్రలో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకొంటున్నారు. ఆ లోటుని ‘స్పైడర్‌’ తీరుస్తుందనుకోవొచ్చా..?

‘స్పైడర్‌’ని జేమ్స్‌ బాండ్‌ కేటరిగిలో పెట్టలేం. ఇదో పెద్ద కమర్షియల్‌ సినిమా. మురుగదాస్‌ సినిమాలు రెండు రకాలుగా ఉంటాయి. ‘రమణ’, ‘కత్తి’లా ఓ సామాజిక నేపథ్యంలో నడిచే కథలతో సినిమాలు తీస్తారు. ‘గజిని’, ‘తుపాకి’లాంటి స్టైలిష్‌ సినిమాలూ తీస్తారు. ‘స్పైడర్‌’ రెండో రకం.

ఇదే మీ తొలి తమిళ చిత్రం. సెట్లోకి వెళ్లే ముందు ఎలా సన్నద్ధమయ్యేవారు..

ప్రిపరేషన్‌ ఏం లేదు. సెట్లో అందరూ తమిళం మాట్లాడేవారు. నాకూ తమిళం వచ్చు కాబట్టి సులభమే అనుకొన్నా. కానీ అంత ఈజీ కాదు. ఓ షాట్‌ ఓకే అవడానికి తమిళంలో 5 టేకులు తీసుకొంటే, తెలుగులోనూ అన్నే టేకులు తీసుకోవాల్సివచ్చేది. ఒకొక్క సన్నివేశానికి నాలుగైదు రోజుల సమయం పట్టేది.

తమిళంలో డబ్బింగ్‌ కూడా మీరే చెప్పారు…

అవునండీ. కానీ చాలా కష్టపడాల్సివచ్చేది. ఎందుకంటే మనం మాట్లాడుకొనే తమిళం వేరు, సినిమా భాష వేరు. మురుగదాస్‌ గారు పక్కన నిలబడి మరీ నాతో డబ్బింగ్‌ చెప్పించారు. దాని కోసం 18 రోజులు పట్టింది.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌ అయ్యిందని మీరే చెప్పారు. దాన్ని రాబట్టుకోవడానికే తమిళంలోకి అడుగుపెట్టారనుకోవొచ్చా?

ఎక్కువ స్పాన్‌ ఉన్న సినిమా ఇది. నా కెరీర్‌లో చాలా ప్రతిష్ఠాత్మకం. ఖర్చు కూడా అదే స్థాయిలో అవుతుందని తెలుసు. వేరే భాషల్లోకి తీసుకెళ్తేనే పెట్టుబడి తిరిగి రాబట్టుకొనే వీలుంటుంది. మురుగదాస్‌ గురించి దేశమంతా తెలుసు. అలాంటి దర్శకుడితో సినిమా చేస్తున్నప్పుడు తమిళ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం అవసరం. మేమిద్దరం కలిశాం కదా అని ద్విభాషా చిత్రం చేయలేదు. కథ అలాంటిది.

సినిమా ఆలస్యమైందన్న అసంతృప్తి ఉందా?

వేసవిలో వద్దామనుకొన్నాం. ఆ తరవాత రంజాన్‌ అనుకొన్నాం. చివరికి దసరాకి వస్తున్నాం. ఆలస్యమైంది, కాదనను. కాకపోతే ఇదంతా ఓ మంచి సినిమా కోసమే కదా? విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఏ సినిమాకీ విడుదల తేదీ మన చేతుల్లో ఉండదు.

సెట్లో మీరు చాలా చలాకీగా ఉంటారట. వాతావరణాన్ని తేలికపరచడానికేనా?

ఓ సినిమాకి పనిచేయడం అంటే మామూలు విషయం కాదండీ. చాలా కష్టపడాల్సివస్తుంది. సెట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ, బయటకు వెళ్లే వరకూ అదే ఎనర్జీతో పనిచేయడం కష్టం. అందుకే వాళ్లతో కలసిపోతుంటా. అది నాకూ సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటుంది.

సినిమాలు… అభిమానులు

maheshbabu-spyder-prerelease1

యేడాదికి 15 సినిమాలు చేసిన చరిత్ర మీ నాన్నగారిది. మీరేమో యేడాదికి ఒక్క సినిమాతోనే పరిమితం అవుతున్నారు. స్పీడు పెంచే ఆలోచనల్లేవా?

ఆ రోజులు వేరు. అప్పట్లా ఇప్పుడూ యేడాదికి పది, పాతిక సినిమాలు చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఒక్కో సినిమా పది సినిమాలతో సమానం. ‘బాహుబలి’ నా దృష్టిలో పాతిక సినిమాల ఖరీదు చేస్తుంది. ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎలాంటి ప్రాజెక్ట్‌ చేస్తున్నామనేదే కీలకం.

హిందీలో అడుగుపెడితే మీ మార్కెట్‌ మరింత విస్తృతం అవుతుంది కదా?

తమిళ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. సరైన సమయం, సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూశా. బాలీవుడ్‌ కూడా అంతే. అగ్ర దర్శకులు కథలు చెబితే తప్పకుడా చేస్తా. అయితే తెలుగులో చాలా పని వుంది.

బాహుబలితో మార్కెట్‌ లెక్కలు మారాయని నమ్ముతున్నారా?

బాహుబలి ఓ మార్గం చూపించింది. ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాబట్టుకొనే సత్తా ఉంది అని నిరూపించింది. మిగిలిన సినిమాలూ ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ‘బాహుబలి’ తరవాత వచ్చిన ‘శ్రీమంతుడు’ భారీ వసూళ్లను అందుకొంది.

అభిమానుల కోసం ఆలోచించి కథలు ఎంచుకోవడం వల్లే తెలుగు సినిమా ఒకే మూసలో ఉండిపోతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. మరి మీ ఎంపిక ఎలా ఉంటుంది?

అభిమానుల ఆలోచనలు, వాళ్ల అంచనాల్ని దృష్టిలో పెట్టుకొంటే సినిమాలు చేయలేం. ఒకొక్కరి ఇష్టాలు ఒక్కోలా ఉంటాయి. ఎక్కువ మంది సంతృప్తి చెందేలా కథల్ని ఎంచుకోవాలి.

మీ అభిమానుల విషయంలో మీకేమైనా కంప్లైంట్స్‌ ఉన్నాయా?

ఏం లేవు. వాళ్లు నా సినిమాల్ని చాలా నిజాయతీగా చూస్తారు.. అభిమానిస్తారు. ‘ఈ సినిమా మీకు నచ్చదు. మీరు వెళ్లిపోండి’ అంటూ థియేటర్‌ నుంచి ప్రేక్షకుల్ని బయటకు పంపించేసి, వాళ్లు సినిమాని ఎంజాయ్‌ చేసిన సంఘటనలు నాక్కొన్ని తెలిశాయి.

నిర్మాతగా సినిమాని చూసే దృక్కోణంలో మార్పులొచ్చాయా?

కథానాయకుడు నిర్మాణంలోనూ పాలుపంచుకొంటే మంచి ఫలితాలొస్తాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే కొన్ని సినిమాలకు నిర్మాణ భాగస్వామ్యం తీసుకొన్నా. అంతే తప్ప నిర్మాతగా మారాలి అని కాదు. నిర్మాతగా పూర్తిస్థాయి సినిమాలు చేయాలన్న ఆలోచనలు లేవు.

సోషల్‌ మీడియా ప్రభావం మంచిదేనంటారా?

మంచి చెడు రెండూ ఉన్నాయి. మంచి సినిమాలకు తప్పకుండా మంచి చేస్తుంది. తేడా కొడితే మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది.

పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌నీ మార్చడానికి ప్రయత్నిస్తారా?

బాడీ లాంగ్వేజ్‌ కోసం ప్రత్యేకంగా ఏం ఆలోచించను. నా వరకూ వీలైనంత సహజంగా కనిపించడానికే ప్రయత్నిస్తాను. వీటి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తే… కొన్ని సార్లు ఏం చేస్తున్నామో మనకే అర్థం కాని పరిస్థితి వస్తుంది.

‘సూపర్‌ స్టార్‌’ అని అభిమానులు మిమ్మల్ని పిలుచుకొంటారు. మీ దృష్టిలో రియల్‌ సూపర్‌ స్టార్లు ఎవరు?

మన దేశంలో చాలా పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారండీ. చిరంజీవిగారు, రజనీకాంత్‌గారు… వీళ్లు నిజమైన సూపర్‌స్టార్లు. సినిమాతో సంబంధం లేకుండా వాళ్ల కోసం థియేటర్లకు వెళ్తారు. నా దృష్టిలో నటుడి కంటే, స్టార్‌ కంటే సినిమానే గొప్పది.

రియాలిటీ షో అవకాశాలేమైనా వచ్చాయా?

లేదండీ. నేను పెద్దగా ఇలాంటి షోల్ని చూడను.

స్టార్‌ హీరోలు తెరపై సిగరెట్‌, మద్యపానం సేవిస్తూ కనిపిస్తే ఆ ప్రభావం అభిమానులపై పడే అవకాశం ఉందని భావిస్తారా?

ప్రేక్షకులు ఎదుగుతున్నారు. వాళ్లంత మూర్ఖులు కాదు. ‘స్పైడర్‌’లో మాత్రం మద్యపానం, ధూమపానానికి సంబంధించిన సన్నివేశాలు ఒక్కటీ లేవు. తెరపై సన్నివేశం జరుగుతున్నప్పుడు కింద స్క్రోలింగ్‌ వేస్తే… ఇంపాక్ట్‌ తగ్గుతుందని అనిపిస్తుంటుంది.

సిక్స్‌ప్యాక్‌పై మీకు పెద్దగా ఆసక్తి ఉండదు ఎందుకని?

సిక్స్‌ప్యాక్‌ అనేది తప్పుడు ఆలోచన. ఫిట్‌గా ఉంటే చాలు.

కొత్త కబుర్లు

‘భరత్‌ అనే నేను…’ సినిమా ఎలా ఉండబోతోంది?

ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే దాని గురించి ఇప్పుడే ఏం మాట్లాడదలచుకోలేదు.

రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఎప్పుడుంటుంది?

మా కలయికలో సినిమా తప్పకుండా ఉంటుంది. ఇద్దరి వీలుని బట్టి ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.

Source : Eenadu

Share

Leave a Comment