మహేష్ తో సెల్ఫీ తీసుకునే ఛాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం త్వరలో సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుతీరబోతున్న సంగతి తెలిసిందే. విగ్రహం అక్కడికి తీసుకెళ్లడానికి ముందే హైదరాబాద్‌లోని ‘ఎఎంబి సినిమాస్’లో మార్చి 25న విగ్రహావిష్కరణ చేసి… ఒక రోజు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా మేడమ్ టుస్సాడ్స్ వారు అభిమానుల కోసం, టాలెంటెండ్ ఆర్టిస్టుల కోసం కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. మీకు మహేష్ ని కలిసి సెల్ఫీ తీసుకోవాలని ఉందా? అలా అయితే ఈ కాంటెస్టులో గెలిస్తే విగ్రహావిష్కరణ సందర్భంగా మహేష్ బాబుతో సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కించుకోవచ్చు.

అందుకు మీరు చేయాల్సిందల్లా… మహేష్ బాబు స్కెచ్ గీసి ‘మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్’ అఫీషియల్ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ పేజీలో వారిచ్చిన హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి పోస్ట్ చేయడమే. మరి ఇంకెందుకు ఆలస్యం. మీలో ఉన్న ఆర్టిస్ట్ ని బయటకి తీసుకువచ్చి మహేష్ తో కలిసే అద్భుతమైన చాన్స్ ని సొంతం చేసుకొండి.

ఇద్దరు విజేతలకు మహేష్ బాబుతో కలిసి మేడమ్ టుస్సాడ్స్ విగ్రహావిష్కరణ సందర్భంగా సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కనుంది. మార్చి 21 ఈ కాంటెస్ట్ చివరి తేదీగా ప్రకటించారు. దీనితో మహేష్ అభిమానులు తమలోని దాగి ఉన్న ఆర్టిస్ట్ ను బయటపెడుతూ మహేష్ స్కెచ్ ల ని గీసి ట్వీట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏ ఒక్కరి విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ కొలువైన ప్రదేశంలో కాకుండా వేరే చోట మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరగలేదు. మ్యూజియం చరిత్రలోనే ఇది మొదటిసారి. హైదరాబాద్ లో ఆవిష్కరణ అనంత‌రం సింగ‌పూర్‌లో అంగ‌రంగా వైభ‌వంగా జ‌రిగే ఐఫా ఉత్స‌వాల్లో మ‌హేష్ మైన‌పు ప్ర‌తిమ భాగం కానుంది.

మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఎవరిదైన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే అ మనిషికి సంబంధించిన 200 పైగా కొలతలు తీసుకుంటారు. అంతేకాదు ఆ వ్యక్తికి సంబంధించిన హెయిర్ కలర్, కళ్ల రంగు వంటివి చాలా జాగ్రత్తగా సేకరిస్తారు. విగ్రహం అచ్చం ఆ వ్యక్తి లాగానే ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇవాన్ రీస్‌ అనే శిల్పి మహేష్ బాబు వాక్స్ స్టాట్యూను రూపొందించారు. గతేది జులైలో విగ్రహం తయారీకి సంబంధించిన స్నీక్ పీక్ ఫోటోలు విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మైనపు విగ్రహ ప్రతిమ అచ్చం మహేష్ లానే ఉంది అని అభిమానులు ఆ రోజే సంబరపడిపోయారు. ఇక ఇప్పుడు మహేష్ పక్కన నుంచి సెల్ఫీ తీసుకోడం అంటే గోల్డెన్ చాన్స్.

ఆ రోజు ఎప్పుడెప్పుడా అని సూపర్‌స్టార్‌ మహేష్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాంటెస్ట్ విజేతలను ఈ నెల 22వ తారీఖు న మేడం టుస్సాడ్స్ వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రకటిస్తారని తెలియజేసారు. సో అప్పటి వరకు వేచి చూడక తప్పదు.

ఈ విగ్రహం సిద్ధమైతే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు కేవలం సూపర్‌స్టార్ అభిమానులే కాకుండా టాలివుడ్ ఫ్యాన్స్ తాకిడి పెరుగుతుందని భావిస్తున్నారు. మహేష్ బాబుకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 25వ సినిమా మహర్షి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. స్నేహం విలువ తెలియ‌జెప్పే క‌థ ఇది. మహర్షి లాంటి సున్నితమైన మనిషిని కొన్ని అనుకోని పరిస్థితులు ఎలా రాటుదేలేలా చేశాయి లాంటి ప్రశ్నలకు సమాధానం వెండితెర మీద చూడాల్సిందే.

మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వేసవి కానుకగా మే 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మహేష్ ను వంశీ పైడిపల్లి ఏ విధంగా చూపించనున్నాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ పాత్ర విభిన్న షేడ్స్ లో ఉంటుందనే విషయం ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. మహేష్ ఎప్పుడు తన సినిమాల ద్వారా ఏదో ఒక కొత్తదనాన్ని అందిస్తూనే ఉంటాడు. అభిమానుల అంచనాలని మించే విధంగానే ఈ చిత్రం ఉండబోతుందని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Share

Leave a Comment