తరువాత ఎవరో..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో. ప్రతి దర్శకుడూ అతడితో ఒక్క సినిమా అయినా చేయాలి అని ఆశిస్తారనడంలో సందేహం లేదు. వేరే ఇండస్ట్రీల దర్శకులు సైతం మహేష్ కోసం ప్రయత్నించడం చూశాం. ఇక తెలుగు దర్శకుల సంగతి చెప్పాల్సిన పని లేదు.

మహేష్ తో ఆ ఒక్క ఛాన్స్ ఎప్పుడెప్పుడా అని దర్శకులు ఎదురుచూస్తూ ఉంటారు. మహేష్ లాంటి అందమైన, ప్రతిభావంతుడైన, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోతో పని చేయాలని ఏ దర్శకుడు కోరుకోడు? ఇలా దర్శకులు చాలామంది తమ ప్రయత్నాల్లో తాము ఉంటారు.

అభిమానులకు కూడా మహేష్ కొత్త సినిమాలపై ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రోజుకో పుకారు బయల్దేరుతోంది. ఫలానా దర్శకుడితో మహేష్ తదుపరి సినిమా అంటూ అదే పనిగా ప్రచారాలు జరిగిపోతున్నాయి. గత కొన్ని నెలల్లో మహేష్ 28వ సినిమా గురించి ఎన్ని ఊహాగానాలు వచ్చాయో లెక్క లేదు.

మళ్లీ త్రివిక్రమ్ తో మహేష్ జట్టు కట్టబోతున్నాడని అన్నారు. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో సినిమా ఖరారైందన్నారు. సుకుమార్ తో ఒక సినిమా క్యాన్సిల్ అయినా మరో సినిమా చేయడానికి మహేష్ రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేశాయి. ఇక మొన్నటి దాకా దర్శకుడు పరశురామ్ తో మహేష్ సినిమా ఖరారు అయిపోయింది అన్నారు.

ఇప్పుడేమో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రశాంత్.

వీటన్నిటినీ తలదన్నేలా ఇంకో ప్రచారం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. అదే మహేష్ బాబు రాజమౌళిల సినిమా. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి సినిమా మహేష్ తోనే అంటూ ఆ ప్రచారం అలా జరుగుతూనే ఉంది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అని ఫిలింనగర్లో గుసగుసలు మొదలయ్యాయి.

అది చాలదన్నట్లు అనిల్ రావిపూడి పనితీరుకు ఫిదా అయి ఎఫ్ 3 లో స్పెషల్ రోల్ చేయడానికి మహేష్ రెడీ అయ్యాడని ఇంకో ప్రచారం. మొత్తానికి మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఇన్ని రూమర్లు వినిపించడం అతని సినిమాలపై జనాల్లో ఉండే క్రేజ్ ను మరోసారి ౠజువు చేస్తుంది.

ఇవన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి మహేష్ 27వ చిత్రం ఒక్కటే అఫీషియల్ గా కంఫార్మ్ అయింది. త్వరలోనే వంశీ పైడిపల్లితో తన తదుపరి సినిమా చేయనున్నాడు. గతంలో మహర్షి వంటి హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మరో సారి కొత్త కథ కధానాలతో మన ముందుకు రానున్నారు.

హీరోయిన్ ఎవరన్నేది తెలుసుకోవాలని అందరు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వంశీ ఈ సినిమా స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నాడు. ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అని సమాచారం. ఈ సినిమా తరువాత మరి మహేష్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share

Leave a Comment