మదర్స్ డే స్పెషల్

అమ్మ..రెండక్షరాలు అమృతం. దేవుడు సృష్టించిన జీవులన్నింటిలోనూ, ఏ విషయంలోనైనా భేదాలుండచ్చు కానీ, అమ్మ ప్రేమలో వ్యత్యాసం ఉండదు. మనిషి నుంచి మృగం వరకూ, పిల్లల్ని సాకడంలో మాత్రం మాతృమూర్తికి తిరుగులేదు. తొమ్మిది నెలల పాటు తన శరీరంలో బిడ్డను కాపాడుకున్న తల్లికి, తొంభై ఏళ్లు దాటినా ఆ బిడ్డ పసివాడిగానే కనిపిస్తాడు.

అమ్మదనంలోని కమ్మదనం అది. ఒక్క మాతృమూర్తికి మాత్రమే ఉండే అద్భుత భావన అది. ఎన్ని యుగాలు గడిచినా, కాలాలు మారినా, మారిపోనిది, మచ్చ లేనిది అమ్మ ప్రేమ. మే 13న మదర్స్ డే. అమ్మకు ఒక రోజేంటి, మన జీవితంలో అన్ని రోజుల్నీ రాసిచ్చేసినా సరిపోవు.

అయినా ఒక రోజంటూ ఉంది కాబట్టి, ఈ సందర్భంగా ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో చంద్రబోస్ సాహిత్యం లో మహేష్, ఎస్ జె సూర్య కాంబినేషన్లో వచ్చిన నాని చిత్రంలోని “పెదవే పలికే” పాటను చూద్దాం. ఈ పాట పాడిన వారు ఉన్నికృష్ణన్ & సాధనా సర్గమ్.

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే… అమ్మ, కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలిగుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ అని సాగే ఈ పాట నిజంగా అద్భుతం.

ఎంత స్టార్ డమ్ వచ్చినా, పుట్టుకతోటే వారు స్టార్స్ కాదు కదా. ఎంతటి సినీ ప్రముఖులైనా తొలిసారి ప్రపంచాన్ని చూసేది అమ్మ కళ్లతోనే. అలాగే తొలి అడుగు వేసేది ఆమె వేలు పట్టుకొనే. ‘మదర్స్ డే ‘ సందర్భంగా మహేష్ బాబు ప్రత్యేకమైన ట్వీట్ చేసారు.

“నేను, నా పిల్లలు గొప్ప అమ్మలను కలిగి ఉన్నందుకు పెట్టి పుట్టాము. వారిని అమితంగా ప్రేమించాలి.అమ్మ..వేలుపట్టి నడకనే కాదు, మనసుపెట్టి నడతనూ నేర్పుతుంది పిల్లలకు.అందుకే సృష్టిలో అమ్మతనం కన్నా కమ్మదనం మరెందులోను లేదంటారు” అని తన తల్లిని స్మరిస్తూ ఓ ట్వీట్ చేశారు.

జీవితంలో ఇంపార్టెంట్ రోజున ఏదయినా మంచి సంఘటన జరిగితే అదో తియ్యని జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. మహేష్ బాబుకు ఈ ఏప్రిల్ 20వ తేదీ అలాంటి మంచి మెమొరీ నే మిగిల్చింది. అది భరత్ అనే నేను సినిమా రిలీజ్ కావడం..ఆ రోజు మహేష్ తల్లి ఇందిర జన్మదినం కావడం..ఆ సినిమా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కావడం..అంతకన్నా ఇంకేం కావాలి.

Share

Leave a Comment