ఆ లక్షణం మహేష్ లో చూసా..

మనం చేస్తున్న ప్రతి పనికీ అవార్డు వస్తుందన్న గ్యారంటీ లేదు. అవార్డుల విషయంలో నా దృష్టిలో రెండు కోణాలు ఉన్నాయి. మన పని బయటకు వచ్చి ప్రేక్షకులందరికీ నచ్చినప్పుడు దాన్ని మించిన అవార్డు లేదు. అలాగే మన పనిని గుర్తించి పిలిచి అవార్డు ఇస్తున్నప్పడు దాన్నొక గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ గౌరవం నా బాధ్యతను పెంచుతుంది అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌.

మహేశ్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. క్లాస్, మాస్ సెంటర్స్ అన్నింటిలో మహేష్ బాబు సత్తా చాటుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పిన విశేషాలు.

మహేశ్‌ బాబు గారి తో నేను ఐదు (1 నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు) సినిమాలు చేశాను. చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు. మహేశ్‌ గారితో పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. ఆయనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది.

మహేశ్‌ గారితో సినిమాలు చేసిన దర్శకులందరితో నేను పని చేయడం వల్ల ఈ విషయం నాకు తెలిసింది. ఆయన డైరెక్టర్స్‌ యాక్టర్‌. ఒక్కసారి కథ విని, ఆయన ఓకే అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అండగా ఉంటారు. అంతపెద్ద స్టార్‌ మనపై నమ్మకం ఉంచినప్పుడు మనకు తెలియకుండానే మన పనిపై మనకు గౌరవం పెరుగుతుంది.

మహేశ్‌ గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా పాట లేదా సన్నివేశం నచ్చినప్పడు చాలా ఎగై్జటింగ్‌గా ఉంటారు. ఆ ఎగై్జట్‌మెంట్‌ వచ్చినప్పుడు ఆయన్ను పట్టుకోవడం కష్టం. ఆ లక్షణం చిరంజీవిగారిలోనూ చూశాను. అందుకేనేమొ వీరిద్దరు అంత పెద్ద స్టార్ స్టాటస్ ని సంపాదించుకోగలిగారు.

ఇదివరకు మహేశ్‌ గారికి నేను సంగీతం అందించిన సినిమాల్లో ఎక్కువగా ఆయన సందేశంతో కూడుకున్న బాధ్యతాయుతమైన పాత్రలు చేశారు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మంచి మాస్‌ సాంగ్స్‌ ఇస్తానని ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున మహేశ్‌ అభిమానులకు ప్రామిస్‌ చేశాను.

అన్నట్లుగానే మంచి పాటలు కుదిరాయి. ఈ సినిమాకే కాదు..దాదాపు నేను చేసిన అన్ని సినిమాలకు మొదటి సిట్టింగ్స్‌లోనే ట్యూన్స్‌ ఫైనలైజ్‌ అయ్యాయి. ఈ విషయంలో నేను కాస్త లక్కీ. సరిలేరు నీకెవ్వరు కథను మొదట నాకు అనిల్‌ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ విన్నప్పుడే ఈ సినిమా పాటల గురించి ఆలోచించుకున్నాను.

ఎందుకంటే కథ ప్రకారం నేను పాటలు ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాగే ఇస్తూ వస్తున్నాను. సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా సందర్భానుసారంగానే పాటలు వస్తాయి. ఈ సినిమాలోని సైనికుల యాంథమ్‌ సాంగ్‌కు నేను లిరిక్స్‌ రాశాను. సైనికులంటే నాకు విపరీతమైన అభిమానం. వారికి నివాళిగా ఉండాలని ఈ సాంగ్‌ చేశాం.

మహేశ్‌ గారు కూడా మెచ్చుకున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక మైండ్‌బ్లాక్‌ సాంగ్‌లో మహేశ్‌ గారి డ్యాన్స్‌ సూపర్బ్‌. ఆయన డ్యాన్స్‌ చూసి మేమందరం షాకయ్యాం. మహేశ్‌ గారి కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా నటించి అందరి మన్ననలను అందుకుంటున్న విషయం తెలిసిందే అంటూ ముగించారు.

Share

Leave a Comment