మరో స్థాయిలో ఉండేది !!

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించింది రెండు సినిమాలే కానీ పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కిస్తే కానీ రాని కీర్తిని సాధించారు అని చెప్పాలి. ఆ రెండు సినిమాలు కూడా నాగ్ అశ్విన్ అభిరుచికి ఫిలిం మేకింగ్ క్వాలిటీకి అద్దం పడతాయి. ఇక నాగ్ అశ్విన్ ఏదైనా ట్వీట్ చేసినా ఏ విషయంపైనైనా తన అభిప్రాయం వ్యక్తం చేసినా అందులో ఒక లాజిక్ ఉంటుంది.

నాగ్ అశ్విన్ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని కమర్షియల్ గా విఫలమైన చిత్రాల గురించి ప్రస్తావిస్తూ అవి బాక్స్ ఆఫీస్ వద్ద మెరుగైన ఫలితం అందుకొని ఉంటే తెలుగు సినీ పరిశ్రమ దశ, దిశ మరోరకంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో సూపర్‌స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ఖలేజా ఒకటి.

ఖలేజా గురించి నాగ్ అశ్విన్ ఇలా చెప్పుకొచ్చారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఖలేజా లాంటి చిత్రాలు కనుక మెరుగైన ఫలితాన్ని నమోదు చేసి ఉంటే ఇండస్ట్రీ యొక్క గమనాన్ని అవి మార్చి ఉండేవేమో. ముఖ్యంగా ఖలేజా కనుక క్లిక్ అయి ఉంటే త్రివిక్రమ్ గారి రైటింగ్ మరో స్థాయిలో ఉండేదని అనుకోవచ్చు.

వీటితోపాటు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆపద్భాందవుడు అంటూ పోస్ట్ చేశారు. నాగ్ అశ్విన్ ప్రస్తావించిన సినిమాల్లో కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ ఎందుకో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపలేకపోయాయి. ముఖ్యంగా ఖలేజా సినిమా చూస్తే ఈ సినిమా ఎందుకు ఆ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయిందో అన్న అనుమానం రావడం ఖాయం.

మరీ అంత ఫెయిల్ కావాల్సిన కంటెంట్ కాదు అని చెప్పి తీరాల్సిందే. ఒక కార్పోరేట్ కంపెనీలు ఒక గ్రామాన్ని సమూలంగా నాశనం చేసేందుకు నిర్ణయించుకుంటే ఎలా ముందుకెళ్తాయి అనే పాయింట్ అప్పటికి కొత్తదే. ఆ సినిమా కనుక హిట్ అయి ఉంటే అలాంటి కొత్త కాన్సెప్టులతో దర్శకులు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఖలేజా సక్సెస్ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతిథి తరువాత ప్రిన్స్ కెరీర్ కు దాదాపుగా మూడేళ్ళు బ్రేక్ పడింది. ఈ మధ్యలో వ్యక్తిగతంగా కూడా కుటుంబం ఒడిదుడుకులకు లోను కావడంతో మహేష్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు మహేష్ బాబు.

ప్రిన్స్ ఎప్పుడెప్పుడూ వెండితెరపై కనిపిస్తారా అని అభిమానులు వేయికళ్ళతో వేచిచూస్తున్న రోజులవి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. కానీ, అది కాస్త వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో ప్రిన్స్ అభిమానుల్లో మరింత నిరీక్షణ పెరిగిపోయింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఒక సూపర్ స్టార్ మూడేళ్ళ పాటు విరామం తీసుకుని సిల్వర్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వడానికి సిద్ధం కావడంతో ఎక్కడలేని భారీ అంచనాలన్నీ ఖలేజా పై నెలకొన్నాయి. టీజర్ ఆండ్ ప్రోమో సాంగ్స్ కి జనాలలో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఆతురత పెరిగింది.

దీనికి తోడు రోమాలు నిక్కపోడుచుకునేలా సాగిన సదా శివ ప్రమోషన్ వీడియో సాంగ్ చూసి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజయవాడలో అర్ధరాత్రి సమయంలో బెనిఫిట్ షో ప్రదర్శన. నగరంలోని ధియేటర్ ప్రాంగణలన్నీ అభిమానులతో కోలాహలం. ఎంత సమయమైనా ఈ షో టాక్ తెలుసుకుని వెళ్దామని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇక చెప్పడానికేముంది.

ఫస్ట్ డే షో పడకముందే డివైడ్ టాక్ ప్రారంభమైంది. అయితే ధియేటర్ లోపల పరిస్థితులు మాత్రం వేరు. సాధారణంగా సినిమా బాగోకపోతే ప్రేక్షకులు మధ్యలోనే బయటకు వచ్చేస్తారు. కానీ, ఖలేజా సినిమా ఇందుకు విరుద్ధం. ప్రతి సన్నివేశాన్ని చూసి హాయిగా నవ్వుకుని, ధియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు మాత్రం బాలేదు అని చెప్పడం ప్రేక్షకుల వంతయ్యింది.

ఈ టాక్ రావడానికి ఉన్న అనేక కారణాలలో పబ్లిసిటీ లోపం స్పష్టంగా కనపడింది. పవర్ ఫుల్ సినిమాగా పబ్లిసిటీ చేసి, ధియేటర్లో ఫుల్ కామెడీ చేసే పాటికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అయితే, ఖలేజా సినిమా అంటే చెవికోసుకునే ప్రేక్షకులకు కొదవలేదు. అప్పటి వరకు చూడని ఒక కొత్త మహేష్ ని చూసారు ప్రేక్షకులు.

త్రివిక్రమ్ డైలాగ్స్ ను మహేష్ బాబు చెప్పినంతగా మరొకరు చెప్పలేరు అనే స్థాయిలో ప్రతి సన్నివేశంలో అద్భుతమైన కామెడీని పండించారు. ఒక రకంగా మహేష్ లో ఇంత కామెడీ యాంగిల్ ఉంటుందని కూడా ఎవరికీ తెలియదు. అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించలేరు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అనే డైలాగ్ ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది.

Share

Leave a Comment