ఎప్పుడూ గుర్తుండిపోతారు

నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలందించిన విజయనిర్మల సంతాప సభను హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సంధ్యా కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల కుటుంబ సభ్యులు సూపర్‌ కృష్ణ, నరేష్‌తో పాటు నటులు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు.

విజయ నిర్మలకు అత్యంత సన్నిహితురాలు, ప్రముఖ గాయని రావు బాలసరస్వతి జ్యోతి ప్రజ్వలన చేశారు. జయసుధ, నమత్రా శిరోద్కర్ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. అభిమానులకు, ప్రముఖులకు ఎలాంటి లోటు రాకుండా అన్నీ ఏర్పాట్లను నమ్రత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ-

“నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో విజయ నిర్మల గారు ఒకరు. 14 సంవత్సరాలుగా మా ప్రయాణం కొనసాగుతోంది. మా పెళ్లి తర్వాత ఆమె నాకు పరిచయం అయ్యారు. మమ్మల్ని ఎంతో ప్రేమించారు. ఎంతో విజన్ ఉన్న వ్యక్తి. ఆమె శక్తివంతమైన మహిళ, దైర్యశాలి, ఫన్ అండ్ లవింగ్ పర్సన్. తన అభిరుచుల విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు.

విజయ నిర్మల గారి మరణం తీరని లోటు. ఆమె తన కుటుంబానికి, ప్రేమించిన వారికి పిల్లర్‌లా నిలిచారు. ఆమె ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆమెకు ఎంత వరకు నా ప్రేమ ఇవ్వగలనో అంత ప్రేమ ను పంపిస్తున్నాను. విజయ నిర్మల గారు మా మనసుల్లో ఎప్పుడూ గుర్తుండిపోతారు” అని తెలిపారు.

దాదాపు 50 సంవత్సరాల పాటు తన జీవితంలో అన్నీ తానై నడిపించిన విజయనిర్మల ఇక లేదని, కనిపించబోదని తెలుసుకున్న తరువాత హీరో కృష్ణ గుండెలవిసేలా కన్నీరు పెట్టుకున్న సమయంలో కూడా ఆయన్ను ఓదార్చేందుకు నమ్రత ముందున్నారు. ఆయన పక్కన వెళ్లి కూర్చుని ఓదార్చారు. చేయి పట్టుకుని ఏడవ వద్దని చెప్పిన విషయం మనకి తెలిసిందే.

దర్శకురాలు విజయనిర్మల ఎక్కడికీ పోలేదని, హీరో కృష్ణతోనే ఉందని మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెషనల్‌ సెంటర్‌లో దశదిన కార్యక్రమాన్ని ఆమె కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ విజయనిర్మల, కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సినీ రంగానికి ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘‘కృష్ణ నేను ఏలూరులో కలిసి చదువుకున్నాం. అప్పటి నుంచి మా మధ్య స్నేహం కొనసాగుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ చలన చిత్ర పరిశ్రమలో విజయనిర్మల మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహిళా దర్శకురాళ్లు చాల తక్కువగా ఉంటారు.

ఉన్నవాళ్లు కూడా ఐదారు సినిమా మాత్రమే చేసి ఉంటారు. అయితే విజయనిర్మల 46 చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ స్వతం చేసుకున్నారు. ఈ రికార్డు ఎవరూ అధిగమించేలేరు. ఈ రికార్డు ఎప్పటికీ విజయనిర్మల పేరుతోను ఉంటుంది’’ అని మురళీమోహన్ స్పష్టం చేశారు.

‘‘అమ్మ (విజయనిర్మల) చుట్టూ పదిమంది భోజనం చేస్తూ ఉంటారు. అమ్మ ఎప్పుడూ నవ్వూతూ ఉంటారు. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ పండుగలా ఉంటుంది. విజయకృష్ణా నిలయంలో ఎన్నో పండుగలు చేసుకున్నాం’’ అని దర్శకురాలు విజయనిర్మల కుమారుడు నటుడు నరేష్ గుర్తుచేసుకున్నారు.

విజయనిర్మల తనకు ధైర్యాన్ని ఇచ్చి పోయిందని చెప్పారు. అమ్మ ఎక్కడికీ పోలేదని, తమచుట్టే అమ్మ ఆత్మ తిరుగుతూ ఉందని చెప్పుకొచ్చారు. అభిమానుల ఎక్కడ ఉన్నా అక్కడ అమ్మ ప్రేమ ఉందని నరేష్ పేర్కొన్నారు. ఆమెది రాణీ జాతకమని, అలాగే పుట్టి, పెరిగిందని కొనియాడారు. దశదినకర్మకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నరేష్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి విజయ నిర్మల కుటుంబసభ్యులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. జయసుధ, బాలకృష్ణ, టి. సుబ్బరామిరెడ్డి, సి. కల్యాణ్‌, ఆర్‌. నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, రమాప్రభ, ప్రభ, జీవితా రాజశేఖర్‌, అచ్చిరెడ్డి, గీతాంజలి, రోజారమణి, గల్లా జయదేవ్‌, గల్లా అరుణకుమారి, బండారు దత్తాత్రేయ, కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి తదితరులు హాజరయ్యారు. సినిమా సెట్‌లోని ఆమెతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Share

Leave a Comment