మహేష్ చేయూతతో…

శ్రీమంతుడు సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలో సిద్ధాపురం గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు.

ఈ రెండు గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పనులను మహేష్ బాబు సతీమణి నమ్రత చూసుకుంటున్న విషయం కూడా విదితమే.

అయితే ఈ రెండు గ్రామాల అభివృద్ధి కోసం మహేష్ దంపతులు నిరంతరం పాటుపడుతున్నారు.

గతం సంవత్సరం మార్చిలో నమ్రత రూ.30 లక్షలను నాట్కో ట్రస్టు ద్వారా సిద్ధాపురంలో అభివృద్ధి పనుల కోసం అందజేశారు.

ఇందుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు చెక్‌ను కూడా ఇచ్చారు. ఈ మొత్తంతో సిద్ధాపురంలో ఓ కొత్త పాఠశాలను నిర్మించాలని కూడా సూచించారు.

తాజాగా సిద్ధాపురంలో తాను చేపట్టిన న్యూ స్కూల్ బిల్డింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరితగతిన పూర్తి కావాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని మహేష్ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు.

అంతే కాకుండా ఈ నిర్మాణాన్ని అద్భుతంగా జరుపుతున్న సుధీర్ రెడ్డి అతని బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

ఏదో దత్తత తీసుకున్నామంటే.. ప్రచారం కోసం తీసుకున్నామనే ధోరణి కాకుండా ద‌త్త‌త అనే పేరును నిజం చేస్తున్నాడు మహేష్.

అభివృద్ధి కార్యక్రమాల‌ను అమ‌లు చేస్తూ ఆ ప‌నుల‌ను సమీక్షిస్తున్నాడు. మహేష్ బిజీగా ఉండ‌డంతో అత‌డి భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ స్వయంగా పనులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

కొందరుంటారు.. మాటలు చెప్పమంటే కోటలు దాటుతాయి. సమస్య పరిష్కారం సంగతి పక్కనపెడితే.. మైకుల ముందు మాత్రం గంటలు గంటలు ఆదర్శాల గురించి స్పీచులు దంచుతారు.

వీళ్ల వల్ల పెద్దగా ఉపయోగమేమి లేదు. కానీ ఇంకొందరు ఉంటారు.. చాలా తక్కువ మాట్లాడుతారు, సందర్భం వచ్చినప్పుడు చేతల్లోనే తమ సత్తా ఏంటో చూపిస్తారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కోవకే చెందుతారు. రీల్ లోనే కాదు.. రియల్ గా కూడా అసలుసిసలు శ్రీమంతుడు మహేష్ బాబు అనిపించేలా వ్యవహరిస్తున్నాడు.

ఈరోజుల్లో చిన్న చిన్న పనులకే భారీ పబ్లిసిటీ కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటిది మహేష్ బాబు ఓ ఊరి కోసం ఇంతలా చేస్తున్నా..పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు.

స్కూల్ భవనం పూర్తయ్యాక మరో భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ నిజాయితీని చాలామంది అభినందిస్తున్నారు.

Share

Leave a Comment