కన్ఫామ్ చేసిన పరశురామ్

ఇది లాక్ డౌన్ టైమ్. క్రియేటివ్ పీపుల్, సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త ఐడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులలో ఈయన కూడా ఒకరు. ఒక్కడు సినిమా చూసి ఇండస్ట్రీలోకి వచ్చాడు.

గాభరాపడకుండా, మెలమెల్లగా మీడియం సినిమాలు చేసుకుంటూ వెళ్లున్నాడు. బ్లాక్ బస్టర్ పలకరించింది. దాంతో సాక్షాత్తూ సూపర్ స్టార్ సినిమా చేసే అవకాశం వచ్చింది. అంతకన్నా గోల్డెన్ చాన్స్ ఇంకేం వుంటుంది. అందుకే కరోనా కల్లోలం ఎప్పుడు ముగుస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు డైరక్టర్ పరుశురామ్.

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ తర్వాత ఇంతవరకు ఆయన ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా గీత గోవిందంతో అదిరిపోయో హిట్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్నాడని ఓ వార్త గత కొంతకాలంగా హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ రూమర్స్ పై పరశురామ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. తాను మహేష్ తదుపరి సినిమాను చేస్తున్నానని ఖరారు చేశారు. అంతేకాదు స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని పేర్కోన్నాడు. మహేష్ తో చేయబోయే సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడారు.

ఒక్కడు సినిమా చూసి ఇండస్ట్రీకి రావాలని డిసైడ్ అయ్యానని ఎలాగైనా దర్శకుడ్ని కావాలనుకున్నానని అయితే మహేష్ బాబుతో పనిచేయడం ఒక కలలానే భావించాను. అది ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. అన్ని ఎమోషన్స్ ఉండేలా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ను తయారుచేస్తున్నాను.

ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చే సీన్లు, డైలాగులు రాయలేక కాదని ఇప్పటి వరకు తన సినిమాల్లో ఆ అవసరం పడలేదని పరశురామ్ చెప్పారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని తనలోని మరో యాంగిల్‌ను చూస్తారని ఇది తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని వెల్లడించారు.

మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు.

ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నానని తెలిపారు. ఇది మంచి సబ్జెక్ట్ అని, అందుకే వదలకుండా దాన్నే పట్టుకున్నానని.. అది తనను వదలకుండా పట్టుకుందని చెప్పారు పరశురామ్. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, నవరసాలు ఉంటాయని వివరించారు.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా సరికొత్త కధతో ఈ సినిమా మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Share

Leave a Comment