మహేష్‌ను కలిసిన కెజీఎఫ్ డైరెక్టర్

ఒక హీరో, ఒక డైరెక్టర్‌ కలిసి, కాసేపు మాట్లాడుకుంటే చాలు అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోతుంది. నెక్ట్స్‌ సినిమా స్టోరీ కోసమే వారిద్దరూ కలిశారనే ఊహాగానాలు వినిపిస్తాయి. ఇప్పుడు అలాంటిదే ఓ టాక్‌ సినిమా సర్కిల్స్ లో అంతా వినిపిస్తోంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రాబోయే సినిమా.

యష్ హీరోగా తెరకెక్కించిన కె.జీ.ఎఫ్: చాప్టర్ 1 తో భారీ విజయం సాధించి సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కె.జీ.ఎఫ్ ఒక ప్యాన్ ఇండియన్ ఫిలిం గా విజయం సాధించడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ప్రశాంత్ నీల్ నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబును కలవడం జరిగిందని నెక్స్ట్ సినిమా గురించి ఇద్దరి మధ్య చర్చలు సాగాయని సమాచారం. ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ తో మహేష్ ను మెప్పించాడట. కె.జీ.ఎఫ్ తరహాలోనే ఈ కథకు కూడా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉందని దీంతో మహేష్ ఎగ్జైట్ అయ్యాడని అంటున్నారు.

రెండు గంటలు పైనే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయట. ఇంత సేపు ఇద్దరూ చర్చించుకున్నారంటే అది ఖచ్చితంగా సినిమా గురించే అయ్యుంటుందని నిన్నటి నుంచి ఒకటే ప్రచారం. దీంతో ఈ కాంబినేషన్ ఫిక్స్ అని ఫిలింనగర్లో గుసగుసలు మొదలయ్యాయి. మరి చివరికి ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేస్తారో లేదో. ఏం జరుగుతుందో చూడాలి.

ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కె.జీ.ఎఫ్: చాప్టర్ 2 షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. దీంతో వీరిద్దరికీ కలిసే అవకాసం లభించింది అనమాట.

దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే వెయిట్ అండ్ సి. మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రానున్న సరిలేరు నీకెవ్వరు అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా దర్శకనిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ సిటీలో కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు సెట్‌ ఏర్పాటు చేసారు.

ఈ సెట్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా కొన్ని పోరాట ఘట్టాల షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మహేష్ బాబుతో పాటు కొంతమంది ఫైటర్లపై ఈ పోరాట ఘట్టాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ ఫైట్ సీన్స్ చిత్రంలో హైలైట్ కానున్నాయని అంటున్నారు.

శరవేగంగా అన్ని హంగులతో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి కూడా ఈ సెట్స్ పై అడుగుపెట్టారని తెలుస్తోంది. చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆమెపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ సెట్‌లోనే సరిలేరు నీకెవ్వరు కి సంబంధించి కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ నెల 12 వ తేదీ వరకు జరిగే ఈ షెడ్యూల్‌‌తో చిత్రంలోని మేజర్ సన్నివేశాల షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా తరువాత మరి మహేష్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share

Leave a Comment