ఐదే నిముషాలు

నట గురువుల, నట కుటుంబం నుండి వచ్చిన నటుడు రాజీవ్‌ కనకాల. రెండున్నర దశాబ్దాలుగా 110 కిపైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాజీవ్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి కుటుంబం సీరియల్స్ నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

జానపదాలు, పౌరాణికాలు, కుటుంబ కథా, కౌబోయ్‌ చిత్రాలేవైనా విజయవంతంగా నిర్మించగల దమ్ము, ధైర్యం తెలుగు దర్శకులకే ఉందంటూ ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. అంతే కాకుండా సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి, క్లాసిక్ చిత్రం అతడు గురించి కూడా ఆయన తెలియజేసారు.

చాలా సినిమాల్లో నేను ఫుల్ లెంగ్త్ రోల్స్ చేశాను. చాలా వాటిల్లో నాకు మంచి పేరు వచ్చింది. కాని అతడు సినిమాలో కేవలం 5 నిముషాలు మాత్రమే ఉంటాను. నా కెరీర్ లోనే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అతడు లోని ఆ 5 నిముషాలే. అసలు ఇంత పేరు, గుర్తుంపు కేవలం అంత తక్కువ నిడివి గల పాత్ర కు దక్కుతాయని నేను అనుకోలేదు.

నేను ఇప్పటి దాకా చేసిన సినిమాలతో చాలా హ్యాపీగా ఉన్నాను. మన దగ్గర నాకు ఎలాగో గుర్తింపు ఉంది. అమెరికాలో కూడా గుర్తింపు వచ్చిందంటే అది కేవలం అతడు సినిమా వల్లే. నేను ఎప్పుడు అమెరికా వచ్చినా అందరూ అతడు గురించే అడుగుతారు. అమెరికాలోని తెలుగు వారందరి ఇంట్లో అతడు డి.వి.డి ఉంటుంది.

అంత ఇంపాక్ట్ సృష్టించిన సినిమా అతడు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఇష్టపడే సినిమా అతడు. మహేష్ ను కలిసినప్పుడు ఇదే చెప్తూ ఉంటాను. అంతెందుకు ఇప్పటికీ అతడు టీవీ లలో వెసినప్పుడు ఇంకా జనాలు బోర్ ఫీల్ అవ్వకుండా చూస్తున్నారు. ఆ సినిమాలో అటువంటి మ్యాజిక్ ఉంది అని తెలిపారు రాజీవ్‌ కనకాల.

మహేష్ తన 25వ సినిమా మహర్షితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఇందులో కూడా రాజీవ్‌ కనకాల ఒక మంచి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరును అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనీల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఎఫ్ 2 సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి, మహర్షి సూపర్ హిట్ తరువాత మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రారంభానికి ముందే సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక మహేష్ పుట్టిన రోజుకు వచ్చిన ఇంట్రో, అలాగే స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా వచ్చిన టైటిల్ సాంగ్ ఆ అంచనాలను మరింతగా పెంచేసాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ కొనసాగుతుంది. 13 ఏళ్ళ తరువాత విజయశాంతి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.

Share

Leave a Comment