మహేష్ గురించి రామ్ చరణ్ ఏమంటున్నాడంటే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు సినీ రంగంలో చాన్నాళ్ల తరవాత పక్కా పల్లెటూరు సినిమా వచ్చిందని చాలా మంది ‘రంగస్థలం’పై ప్రశంసల వర్షం కురిపించారు.

మరోవైపు, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదికే బ్లాక్ బస్టర్లుగా చెప్పుకుంటున్నారు.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో రామ్ చరణ్, మహేష్ ఫ్యాన్స్ మధ్య జగడం మొదలైంది. ముఖ్యంగా కలెక్షన్ల విషయంలో. మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే మా వాడి సినిమా ఎక్కువ రాబట్టందని యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ సోషల్ వివాదంపై తాజాగా రామ్ చరణ్ ఘాటుగానే స్పందించారు. ఇదొక పనికిమాలిన చర్య అని అసలు తనకు, మహేష్ మధ్య పోటీనే లేదని చెప్పారు.

‘నా సినిమాకు మహేష్ ‘భరత్ అనే నేను’కు ముడిపెట్టి జరుగుతున్న రచ్చను నేను చూశాను. హెడ్‌లైన్స్‌లో నిలవాలని ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు. మహేష్, నేను మంచి ఫ్రెండ్స్. మా సినిమాల విజయాలతో మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.

సినిమా వసూళ్ల కోసం మేమిద్దం పోటీపడుతున్నాం అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. వివాదాలు సృష్టించాలనుకునేవారు చేస్తున్న ప్రచారం ఇది. విభజించు-పాలించు అనే సూత్రం ఇక్కడ పనిచేయదు. మేమంతా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. కలిసికట్టుగానే పనిచేస్తాం. మా సినిమాల ద్వారా లాభాలొస్తే అది పరిశ్రమ బాగుకే ఉపయోగపడుతుంది’ అని చరణ్ వివరణ ఇచ్చారు.

ఈ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకోవడం పట్ల తాను నిజంగా చాలా సంతోషంగా ఉన్నానని చరణ్ చెప్పారు. ‘ఈ రెండు సినిమాలు రావడానికి ముందు అంతా చాలా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వివాదాలు మొదలుపెట్టేశారు.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ మంచి విజయాలను అందుకుంటోంది. ఎవరికి వారి వ్యక్తిగత విజయాల కన్నా పరిశ్రమ విజయం చాలా ముఖ్యం’ అని చరణ్ తేల్చి చెప్పారు. మరి ఇంత వివరణ ఇచ్చిన తరవాత అయినా మహేష్, చరణ్ ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.

Share

Leave a Comment