థ్యాంక్యూ మహేష్ అంటున్న చరణ్

రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `రంగ‌స్థ‌లం`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు.

మార్చి 30న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. మార్చి 30న విడుదలైన ఈ చిత్రంపై పరిశ్రమలోని అందరి దగ్గర నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సినిమాలో నటించిన యాక్టర్ల కంటే వాళ్లు చేసిన పాత్రలే ప్రేక్షకులకు గుర్తుండిపోతున్నాయంటే అందరూ ఏ రేంజిలో నటించారో అర్ధం చేసుకోవచ్చు. అందుకే రంగస్థలం చూసిన సెలబ్రిటీలంతా సినిమా టీంను కాంప్లిమెంట్లలో ముంచెత్తుతున్నారు.

తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేరారు. రంగస్థలం సినిమా చూసిన మహేష్ బాబు చిత్ర యూనిట్‌ని మెచ్చుకుంటూ.. తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

‘‘రంగస్థలం అద్భుతమైన సినిమా. సుకుమార్.. చిత్రీకరణలో నీవు నిజంగా మాస్టర్‌వి. దేవిశ్రీ ప్రసాద్.. నీవు రాక్‌స్టార్ అంతే. రత్నవేలు బ్రిలియంట్ ఫొటోగ్రఫీ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మరోసారి తమ ప్రతిభను కనబరిచారు.

రామ్ చరణ్ మరియు సమంత, మీ కెరియర్‌లోనే అద్భుతమైన నటనను కనబరిచారు. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు. రంగస్థలంతో చాలా సంతోషం పొందాను’’ అంటూ మహేష్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

దీనికి బదులుగా మహేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతూ రామ్‌ చరణ్‌ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. థ్యాంక్యూ మహేష్ అంటూ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో ఆనందం వ్యక్తపరిచారు.

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘భరత్ అనే నేను’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సోషియో పొలిటికల్ ప్రాజెక్ట్‌లో మహేష్ యువ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు.

Share

Leave a Comment