ఖచ్చితంగా ఫాలో అవుతున్నా

టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ స్టార్స్‌ అందరితో యాక్ట్‌ చేశారు సమంత. జత కట్టిన ప్రతి హీరోతో హిట్‌ సాధించారు సమంత. పెదాలపై తారాడే చిరునవ్వు, కళ్లలో పలికే వేల భావాలు, జలపాతంలా దూకే మాటల ప్రవాహం వెరసి స్వచ్ఛమైన అందానికి అచ్చమైన చిరునామాగా భాసిల్లుతున్నారు ఆమె. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఓ బేబి.

ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సమంత పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకున్నారు. సినిమా మరియు తన వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించడమే కాకుండా ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు. మహేష్ బాబు చెప్పిన మాటలు తన కెరీర్ కు ఎంతగానో హెల్ప్ చేసాయని చెప్పారు సమంత.

‘దూకుడు షూటింగ్ సమయంలో మహేష్‌ బాబు గారు నాకు కెరీర్‌లోనే ఉత్తమమైన సలహా ఇచ్చారు. ప్రతి సినిమాను కొత్త సినిమాగానే భావించు. అప్పుడే రాణిస్తావు అని చెప్పారాయన. మహేష్‌ బాబు మాటల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాను. ఆయన్నే ఫాలో అవుతున్నా. మరింత బాధ్యత గా ఉంటూ నా సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నాను’ అని తెలిపారు సమంత.

సమంత కు మహేష్ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. సమంత మొదటి సినిమా ఏ మాయ చేసావే నిర్మాత మహేష్ సోదరి మంజుల గారు అని తెలిసిన విషయమే. ఇక నమ్రత, సితారలతో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి అందరికీ తెలిసిందే. సితారతో ఇంటరాక్ట్ అయ్యిన కొన్నింటిని సోషల్ మీడియాలో కూడా సమంత షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ సితార ఎక్కడ కనపడినా సమంత ముద్దు చేస్తుండండం మనం గమనించవచ్చు. ఈ మధ్య అమరావతి లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యిన సమంత మహేష్ బాబు గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘అందరికీ తెలియని విషయం ఏంటంటే మహేష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇంటూ 100 అనమాట. పీక్స్ లో ఉంటది.

అది ఎవరికీ కనిపించదు. ఎవరికీ తెలియదు కూడా. ఓన్లీ ఆయనతో అలవాటు ఉంటే ఆయన ఆ సైడ్ ని ఓపెన్ చేస్తారు. సెట్లో ఎక్కడ అయినా నవ్విన సౌండ్ వస్తే అక్కడ ఆయన ఉంటారు. హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అమేజింగ్. మహేష్‌ బాబు గారు వేసే పంచ్ లు అయితే చెప్పక్కరలేదు’ అని చెప్పారు సమంత.

రీసెంట్ గా సినిమాల ప‌రంగా సమంత ఎంపిక చేసుకునే పాత్ర‌లు ప్రేక్ష‌కుల హృద‌యాలని కొల్ల‌గొట్టేలా ఉంటున్నాయి. ‘కెరీర్ ఆరంభంలో మాదిరిగా వరుసగా ఐదారు సినిమాలు చేయాలనే ఆత్రుత ఇప్పుడు లేదు. ఒక్క సినిమా చేసినా కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు సమంత.

మ‌హేష్ రీసెంట్‌గా తన 25వ సినిమా మ‌హ‌ర్షి చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ ను తన ఖాతాలో వెసుకున్న సంగతి తెలిసిందే. 35 రోజులు అవుతున్నా మహర్షికి ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే సినిమా జనాల్లోకి ఏ విధంగా చేరువయ్యిందో స్పష్టంగా అర్ధమవుతుంది. తన సిల్వర్ జూబ్లీ సినిమా తో మహేష్ ప్రశంసలతో పాటుగా కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న మహేష్ తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు మూవీ మే 31 వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుందని సమాచారం. వెకేషన్ నుంచి తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్‌ పాత్ర చేస్తున్నారు. ఆర్మీ నుంచి సిటీకి వచ్చిన ఓ వ్యక్తి జీవితంలో జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.

ఈ సినిమాను దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి గారు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబుకి జోడీగా రష్మిక నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమా ప్రారంభించిన రోజునే విడుదలపై క్లారిటీ ఇచ్చేసారు.

Share

Leave a Comment