లైన్ వినిపించాను

అర్జున్‌రెడ్డి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్ట‌ర్‌ సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ అనే టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. తెలుగులో విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ రీమేక్లో షాహిద్ కపూర్ మరియు కియారా అద్వానీ ముఖ్య పాత్రలు పోషించారు.

కబీర్ సింగ్ విజయవంతంగా ప్రదర్శించబడుతూ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు సందీప్. ఈ సినిమా త‌ర్వాత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబుతో సందీప్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ కాంబినేషన్ గురించి మీడియాలో వార్తలు రావడమే కానీ అధికారికంగా ఎవరూ స్పందించలేదు.

మహేష్ తో సినిమాపై సందీప్ వంగ స్పందించారు. ప్రస్తుతం ఇద్దరం కూడా వేరు వేరు కమిట్ మెంట్స్ ను పెట్టుకుని సినిమాలు చేస్తున్నాం. అవి పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు మూవీ ఆలోచన చేస్తా. మ‌హేష్‌కు కొంత సినిమా లైన్ ను వినిపించాను. పూర్తి క‌థ ను వినిపించాలి. ఇంకా కథ రాసే పనిలోనే ఉన్నాను అని సందీప్ తెలిపారు.

తన తదుపరి చిత్రం ఒక భారీ క్రైమ్ డ్రామా మూవీ అంటూ చెప్పుకొచ్చారు సందీప్. సినిమాలు గొప్పగా ఉంటే భాషలు అనేవి ఒక మ్యాటర్ కాదనే విషయాన్ని బాహుబలి మరియు కేజీఎఫ్ చిత్రాలు నిరూపించాయి. అందుకే తాను కూడా అలాంటి సినిమాలను తీసి అన్ని భాషల ప్రేక్షకులను నచ్చే విధంగా చేయాలనే పట్టుదలతో ఉన్నాడట.

ప్రేక్షకులు మంచి కంటెంట్ తో సినిమా తీస్తే బాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. అందుకే తన క్రైమ్ డ్రామా మూవీని విభిన్నంగా అందరిని ఆకట్టుకునేలా తీస్తానంటూ సందీప్ వంగ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఆ సినిమాకు పాన్ ఇండియా అపీల్ ఉంటుందని తెలియజేసారు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డితో నాకు చెప్పలేనంత అనుబంధం ఉంది.

నా జీవితంలో ఎంత ప్రభావం చూపించిందంటే నా కొడుకు పేరును కూడా అర్జున్ రెడ్డి‌గా పెట్టుకొన్నాను. అర్జున్ రెడ్డి సినిమాకు నా తండ్రి ప్రభాకర్, ప్రణయ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. నాకే కాదు నా కుటుంబానికి కూడా అర్జున్ రెడ్డి అలా దగ్గరయ్యాడు అని చెప్పుకొచ్చారు.

సందీప్ వంగ పూర్తి కథతో మహేష్ ని మెప్పిస్తే క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయినట్లే. సూపర్ స్టార్ స్టార్ పవర్ కి సందీప్ యాటిట్యూడ్ తోడయ్యితే ఆ సినిమాకు ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో చెప్పడం కష్టం. మ‌హేష్ రీసెంట్‌గా తన 25వ సినిమా మ‌హ‌ర్షి చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ ను తన ఖాతాలో వెసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తో బిజీ అయిపోయారు. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్‌ పాత్ర చేస్తున్నారు. ఆర్మీ నుంచి సిటీకి వచ్చిన ఓ వ్యక్తి జీవితంలో జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది. కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.

చిత్రంలోని మహేష్ బాబు పాత్ర పేరు అనిల్‌ రావిపూడి తాజాగా రివీల్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా మారారని, కాశ్మీర్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ సినిమాను దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. 13 ఏళ్ళ తర్వాత విజయశాంతి గారు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబుకి జోడీగా రష్మిక నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమా ప్రారంభించిన రోజునే విడుదలపై క్లారిటీ ఇచ్చేసారు.

Share

Leave a Comment