ఎప్పుడూ ముందే ఉంటారు

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్‌ నిర్వహిస్తున్న ‘మనం సైతం’ సేవా సంస్థకు సూపర్‌స్టార్‌ కృష్ణ అండగా నిలబడ్డారు. ఇలాంటి విషయాల్లో మన సూపర్‌స్టార్‌ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన తన సతీమణి విజయ నిర్మలతో కలిసి 4 లక్షల రూపాయలు మనం సైతంకు విరాళంగా అందజేశారు. హైదరాబాద్‌లోని కృష్ణ నివాసానికి కాదంబరిని పిలిపించుకున్న కృష్ణ తన వంతుగా పేదలకు పంచమని ఈ విరాళం అందజేశారు.

ఈ సందర్భంగా కృష్ణ ‘కాదంబరి కిరణ్‌ మనం సైతంతో మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. నటుడిగా కొనసాగుతూ పేదలను ఆదుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు, చదువులు ఆర్థిక భారమైన వాళ్లకూ సహాయం అందజేస్తున్నారు. మా వంతుగా విరాళం ఇస్తున్నాం. మనం సైతంకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అన్నారు.

కాదంబరి కిరణ్‌ మాట్లాడుతూ ‘మా అమ్మ విజయ నిర్మల, పెద్దలు సూపర్‌స్టార్‌ కృష్ణ గారు మనం సైతం కుటుంబంలో భాగమవడంతో మాకు గొప్ప నీడ దొరికినట్లు అనిపిస్తోంది. ఇవాళ ఆయన చేతుల మీదుగా ప్రవీణ్‌ కుమార్‌, రాజేందర్‌ రెడ్డి, దుర్గారావు, రాజ్‌ కుమార్‌, ప్రాణమిత్ర వంటి ఐదుగురు పేదలకు సహాయం అందజేశాం. గతంలో కేటీఆర్‌ చేతుల మీదుగా వెబ్‌సైట్‌ ప్రారంభించగానే ఎన్‌ఆర్‌ఐలు స్పందించి విరాళాలు అందజేశారు.

మనం సైతం సహాయం ఆశిస్తున్న ఎందరకో చేరువవుతోంది. పేదవాడే నా కుటుంబం, పేదలకు ఆసరాగా నిలబడటమే నా జీవిత ఆశయంగా పెట్టుకున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, వల్లభనేని అనిల్‌ కుమార్‌, వినోద్‌ బాల, రచ్చరవి తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌స్టార్ కృష్ణ గారి దారిలోనే నడుస్తున్నారు మహేష్ బాబు. నటుడిగానే కాకుండా మంచి మనసున్న మానవతా వాదిగా కూడా నిరూపించుకుంటున్నారు సూపర్‌స్టార్ మహేష్. బుర్రిపాలెం, సిద్ధాపురం అనే రెండు గ్రామాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలకు తన సంపాదనలో 30 శాతం విరాళంగా ప్రకటించి సమాజం పట్ల బాధ్యతను నెరవేరుస్తున్నారు మహేష్.

వీళ్లలో కొందరికి అనారోగ్య చికిత్సకు, మరికొందరి చదువులకు ఆర్థిక సహాయం అందజేశారు. లైట్ మెన్ ప్రవీణ్ కుమార్ కి 25,000 అందజేసారు. అతనికి పాపపుట్టింది. ఊపిరి తిత్తుల్లో లోపం ఉందట,తల్లికి కూడా బాలేదు. 4 నెలలుగా జీతాలు ఇవ్వని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూన్న రాజేంద్రరెడ్డి పిల్లలకి స్కూల్ ఫీజ్ లకు 25,000.

ప్రసాద్ లేబ్ లో బాయ్ దుర్గారావుకి ‭హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ కోసం 25,000. ఆంధ్రజ్యోతి సబ్ఎడిటర్ రాజ్ కుమార్ గారి కొడుకు సోమేశ్వర్ కి ఒక ఊపిరితిత్తి పెరగటంలేదు. నిరంతరం ఆక్సిజన్ అందించాలట. వైద్యం కోసం 30,000. రచయిత ప్రాణమిత్ర బాబు లక్ష్మణ్ వేదవ్యాస్ బీటెక్ ఫీజ్ కొరకు 25,000 అందించారు.

Share

Leave a Comment