తిరుగులేని జర్నీ..

తెలుగు సినిమా అనే వెలుగులో అభిమానులకు ఆకాశమంత ఆనందాన్ని పంచుతూ వస్తున్నారు ఆయన. ఆయన అడుగు పడితే వెండితెర ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. ఆయన అభినయిస్తే ఆ సినిమా ఇంకా అద్భుతంగా నడుస్తుంది

తనలో కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు తానే వెలికితీస్తూ తనకుతానుగా సొంతంగా హుందాగా నిలబడ్డాడు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్‌ కృష్ణ గారి వారసుడిగా
మహేష్ బాబు వెండితెరకు పరిచయం అయినా ఆ చాయలు కూడా తనకు తగలనివ్వలేదు

ప్రతి అడుగులోనూ తన ప్రత్యేకత చూపిస్తూ వచ్చాడు. ఇదీ మహేష్‌ అంటే అని అభిమానులు చెప్పుకునేందుకు సినీప్రపంచంలో అతడికంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటూనే ఉన్నాడు. సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచేసే వయసు 45 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే

45 ఏళ్లలో నటుడిగా 41 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు మహేష్ బాబు. నిజానికి చైల్డ్ హీరోగా మహేష్ కనబరిచిన స్పార్క్ చూసి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇతనికి ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీ ఎలా వచిందబ్బా అని సెట్స్ మీదనే నోరెళ్ళబెట్టి చూసేవాళ్ళు యూనిట్ మెంబర్స్

1979 లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో కేవలం నాలుగేళ్ళ చిరుప్రాయంలో తొలిసారిగా నీడ చిత్రానికి గాను కెమెరాను ఫేస్ చేసినప్పటి ముహూర్త బలం ఎంత బలమైనదో గానీ మహేష్ బాబు లో కెమెరా ఫియర్ అన్నది ఎప్పుడూ ఎవరూ చూసి ఉండలేదు

నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని 1983 లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో పోరాటం చిత్రం తో మరలా కెమెరా ముందుకు వచ్చారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం, అన్నతమ్ముడు, గూఢచారి117, బాలచంద్రుడు చిత్రాలలో అదరగొట్టేసారు

ఇక 1999లో కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన రాజకుమారుడు తో హీరోగా ప్రారంభమైన మహేష్ బాబు కేరీర్ ప్రభంజన విజయాలతో దూసుకుపోతూ సూపర్ స్టార్ వారసత్వాన్ని గొప్పగా కొనసాగిస్తున్నారు

1999 నుండి 2020 మధ్య కాలంలో 26 చిత్రాలలో నటించిన మహేష్ బాబు అద్భుత విజయాల ద్వారా ఎంత క్రేజ్ సంపాదించారో తన అరుదైన వ్యక్తిత్వం ద్వారా అంత స్థాన విశిష్టతను సంపాదించుకున్నారు. తన ఈ సినిమాల ప్రస్థానంలో అఖండ విజయాలు ఉన్నాయి అనూహ్య పరాజయాలు ఉన్నాయి

అయితే జయాపజయాలను ఒక సమతుల్య స్థితిలో స్వీకరించే మానసిక పరిపక్వతను అలవరచుకున్నారు మహేష్ బాబు. ఒక దర్శకుడిని ఒకసారి నమ్మి మాట ఇస్తే ఇక ఆ దర్శకుడు ఏం చెప్పినా ఏం చేసినా పూర్తి విధేయతతో పని చేయడం మహేష్ బాబు కమిటెడ్ నేచర్ కు నిదర్శనం

ఇదే మహేష్ బాబు బలమూ బలహీనత కూడా. ఆ బలం తనకు అద్భుత విజయాలను అందిస్తే, ఆ బలహీనత కొన్ని పరాజయాలను అందించింది. అయితే ఫలితాలు ఎలా ఉన్నా తన సినిమాల విజయాల క్రెడిట్ ను తన దర్శకులకు ఆపాదించి అపజయ భారాన్ని మౌనంగా తన భుజాన వేసుకునే సంస్కారి

ఎవ‌రూ ద‌క్కించుకోన‌న్నీ నంది అవార్డుల‌ను ప్రిన్స్ మహేష్ బాబు ద‌క్కించుకున్నారు. ఏ ఆర్టిస్ట్ కి అయినా అవార్డులు అనేవి ఎప్రీసియేషన్ లాంటివి. వ్య‌క్తిగ‌త ఖాతాల్లో ఎక్కువ‌గా 8 నంది అవార్డులు దక్కించుకున్న హీరోగా మహేష్ బాబు నిలిచి తన ప్రత్యేకత చాటుకున్నాడు

Share

Leave a Comment