నిస్సందేహంగా గొప్ప నివాళి

తెలుగు చిత్రసీమ గర్వపడే నటుడు, దివంగత మహానేత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకొని కలెక్షన్లను కొల్లగొడుతూ దూసుకెళ్తోంది.

ఈ సినిమా పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ చిత్రం పై తన స్పందన ను అదిరిపోయే రీతి లో తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన బాలకృష్ణకు, దర్శకుడు క్రిష్ కు, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

తెలుగు సినీ పరిశ్రమకు లెజెండ్ అయిన ఎన్టీఆర్‌ గారికి ఈ స్థాయిలో ఘన నివాళి ఇంతవరకు ఎవరూ, ఎప్పుడు ఇవ్వలేదని మహేష్ బాబు పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా ఆయనకు నిస్సందేహంగా గొప్ప నివాళి అని కొనియాడారు. మహానటుడి జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలను అందంగా చిత్రీకరించి ప్రపంచానికి తెలియజేశారన్నాడు.

‘మహాద్భుతం.. దర్శకుడు క్రిష్ తన కుంచెతో వెండితెర కాన్వాస్‌పై అద్భుతం చేశాడు. మహా నటుడి జీవితం గురించి ప్రపంచానికి తెలియని విషయాలను అందంగా చిత్రీకరించారు. ఆ పాత్రలో బాలకృష్ణ గారు జీవించారు. అన్ని క్యారెక్టర్లనూ నిజ జీవితానికి చాలా దగ్గరగా చూయించారు. బ్రిలియంట్’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా కంటే ఏదైన గొప్ప సినిమా మరొకటి ఉందంటే.. అది ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రమే అని మహేష్ పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారని ప్రశంసించారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

కాగా ఈ ట్వీట్‌కి దర్శకుడు క్రిష్ రిప్లే ఇచ్చారు. “థాంక్యూ మహేష్ గారు. మీ నుంచి అభినందనలు రావడం నిజంగా మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మా టీమ్ అందరి నుండి మీకు ధన్యవాదాలు” అంటూ క్రిష్ పేర్కొన్నారు. అంతే కాకుండా మహేష్ ఈ చిత్రం గురించి చేసిన మూడు ట్వీట్లను దర్శకుడు క్రిష్ తన ఖాతా నుండి రీట్వీట్ చేసారు.

ఎన్టీఆర్ తొలి భాగం ‘కథానాయకుడు’ని హైదరాబాద్ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు క్రిష్ చూశారు. అనంతరం తనని పలకరించిన మీడియాతో క్రిష్ మాట్లాడుతూ ‘ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా నేను చూశాను. కొన్ని స్క్రీన్స్ లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు.

కానీ, మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో అంతే గొప్పగా ఈ స్క్రీన్ లో ఉంది. ఇంకోసారి ఆ స్క్రీన్ లోనే సినిమా చూడాలి. ఈ సినిమాస్ ను నిర్మించిన మహేష్ బాబు గారికి ధన్యవాదాలు అన్నారు. ఏఎంబీ సినిమాస్ లో అయితే కథానాయకుడు బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. షోస్ ను కూడా అంతే భారీ స్థాయిలో ప్రదర్శించారు. సుమారు ముప్పై రెండు షోలు మొదటి రోజు వేసారు.

ఈ చిత్రం మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాను చూసిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎన్‌టి‌ఆర్, ఏఎన్ఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు అలాగే ఎన్‌టి‌ఆర్ కృష్ణుడి వేషంలో కనిపించే సీన్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ప్రస్తుతం మహేష్ ప్రతిష్ఠామకమైన 25వ సినిమా మహర్షిలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటిదాకా కనిపించని విధంగా కొత్త లుక్ లో కనబడతున్నారు మహేష్. అనేక ప్రత్యేకతలు ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మహర్షి పై మహేష్ అభిమానుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

సినిమా సెట్స్ పై ఉండగానే పక్కా ప్లాన్డ్ గా, అంతే ఎఫెక్టివ్ గా సినిమా నుండి ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్న తీరు, ‘మహర్షి’ టీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎలివేట్ చేస్తుంది. మాస్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ అందరూ మెచ్చేలా అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయని యూనిట్ నమ్మకంతో ఉంది.

Share

Leave a Comment