వందసార్లు అడిగినా నా మాట ఒకటే..

సంక్రాంతి అయిపోయింది. కోడిపందాలూ అయిపోయాయి. కానీ, పండుగకు వచ్చిన పెద్ద హీరోల చిత్రాల సందడి అయిపోలేదు. హాళ్ళలో హడావిడి, కలెక్షన్లు రికార్డుల పోటీలు సాగుతూనే ఉన్నాయి. హీరో మహేశ్‌ బాబు చెరగని చిరునవ్వు, తరగని ఉత్సాహంతో ఒక వార్తా పత్రిక కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దం.

కంగ్రాట్స్‌. ఈ సంక్రాంతి మీ కెరీర్‌లో సరిలేనిది అయినట్టుంది?
అవునండీ! దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఒక విభిన్నమైన శైలి ఉంది. ప్రతి సినిమాలో ఆయన జనం చెప్పుకొనేలా కొన్ని ఊతపదాలను ఆయా పాత్రలకు మేనరిజమ్స్‌ గా పెడుతుంటారు. మా సరిలేరు నీకెవ్వరు లో నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌, అర్థమవుతోందా, అలాగే నా పాత్రకు టేక్‌ ఎ బౌ అంటూ తల వంచి, నమస్కరించడం లాంటివి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు.

ముందు అనుకున్న ప్రాజెక్ట్‌ కాక ఉన్నట్టుండి అనిల్‌తో సినిమాకి కారణం?
నలభై నిమిషాల పాటు అనిల్‌ రావిపూడి నాకు ఈ కథ చెప్పాడు. ఆర్మీ రోల్‌ నాకు నచ్చింది. ఇటీవల ఎక్కువగా సందేశం నిండిన సామాజిక చిత్రాలు చేస్తున్న నాకు, అనిల్‌తో ఈ తరహా వినోదాత్మక చిత్రం వెంటనే చేయడం కరెక్ట్‌ అనిపించింది. అతణ్ణి పిలిచి, మన ప్రాజెక్ట్‌ ఏమన్నా ముందుగా చేయగలమా అని అడిగాను. వెంటనే ఒప్పుకున్నాడు. పూర్తి స్ర్కిప్టు రెడీ చేసి, ఆర్మీ పాత్ర కోసం శారీరకంగా నేను కొంత సిద్ధం కాగానే షూటింగుకు వెళ్ళాం. జూలై నుంచి 5 నెలల్లో ఇంత పెద్ద సినిమా చేసి, అభిమానుల ముందుకు తెచ్చేశాం.

అభిమానులు సంతృప్తి చెందారా?
పూర్తిగా.. గడచిన నాలుగేళ్ళుగా నాకు ఫ్యాన్స్‌ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు తగ్గట్టు ఉన్న సినిమా ఇది. మాస్‌ పాటలు, ఫైట్లతో వాళ్ళు నా నుంచి పూర్తిస్థాయి వినోదాత్మక, వాణిజ్య చిత్రం కోరుకుంటున్నారు. వాళ్ళ మాటను నేనెక్కడో పక్కనపెడుతూ వచ్చాను. ఇప్పుడీ సినిమాతో వాళ్ళు ఇది కదా మేము ఇన్నాళ్ళుగా కోరుతున్నది అంటున్నారు. వాళ్ళ ఆకలి తీరే విందు భోజనం పెట్టాం. అందుకే, ఈ ప్రాజెక్టును అనుకున్నదాని కన్నా ముందుకు తీసుకురావడం, ఈ దశలో ఈ సినిమా చేయడం నా కెరీర్‌లో తీసుకున్న బెస్ట్‌ డెసిషన్‌ అంటాను.

ఈ సంక్రాంతికి వెండితెర మీద గట్టి పోటాపోటీ నడుస్తోంది! రిలీజు డేట్లపైనా చర్చోపచర్చలు జరిగాయి కదా!
సంక్రాంతి అనేది మనకు చాలా పెద్ద పండుగ సీజన్‌. పైగా మాది పూర్తిగా సంక్రాంతి సినిమా. మొదటి నుంచీ మా చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్‌ చేయాలనుకున్నాం. ఆ లక్ష్యం పెట్టుకొనే, ఎక్కడా రిలాక్స్‌ కాకుండా పని పూర్తి చేశాం. సమయానికి సినిమా పూర్తి చేసి, రిలీజ్‌ చేసిన ఆ క్రెడిట్‌ అంతా నిర్మాతలు, దర్శకుడిదే. ఇక ఏ సినిమా ఎప్పుడు, ఎలా రిలీజ్‌ చేయాలని చూసుకోవడానికి చిత్ర పరిశ్రమలో పెద్ద మనుషులు, ఛాంబర్లు, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌, డిస్ట్రిబ్యూటర్లు, దిల్‌ రాజు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అది వాళ్ళ పని. నాకు సినిమాల్లో నటించడం లాంటి చాలా పనులున్నాయి. అవి చాలు.

పరిశ్రమలోని పోటాపోటీ, వేడెక్కిన వాతావరణంతో రిలీజ్‌ విషయంలో ఒత్తిడి లేదా?
ఒక్కోసారి ఛార్జ్‌డ్‌ ఎట్మాస్ఫియర్‌ కూడా బాగుంటుంది. ఇలాంటి ఫీల్‌ ఉన్న సినిమా వస్తే సంక్రాంతికి నిజమైన పండుగ. అయినా నాకేం ఒత్తిడి. ఇందాకే చెప్పినట్టు, నేను నటించాలి, నా ఇల్లు, పిల్లలు, ఇతర వ్యవహారాలు చూసుకోవాలి. రిలీజ్‌ పనులు, వ్యవహారాలు నా నిర్ణయం కాదు. నిర్మాతలతో సహా అనేకమందిది!

ఇటీవలి మీ చిత్రాలకు మీరూ నిర్మాత కదా!
హీరోగా ముందే పారితోషికం తీసుకొని, నటిస్తే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది. అందుకని, ముందుగా డబ్బులు తీసుకోకుండా, నిర్మాణంలో హీరోగా నేను కూడా ఇన్‌వాల్వ్‌ అయినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. మన ప్రమేయం కూడా ఉంది కాబట్టి, ప్రొడక్షన్‌లో డిసిప్లిన్‌ ఉంటుంది. అందుకే జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌తో నిర్మాణంలో భాగమవుతున్నా.

నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌… బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌ అని ప్రచారం చేస్తున్నారు!
నా కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌. ఈ స్ర్కిప్టులో జనానికి కావాల్సిన వినోదం, సెంటిమెంట్‌, యాక్షన్‌ అన్నీ ఉన్నాయి. పాత్రకు తగ్గట్టు నేను కూడా ఓపెన్‌ అప్‌ అయి అబ్బబ్బబ్బ అంటూ ఫన్నీ డైలాగులు చెప్పా. శేఖర్‌ మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో చేసిన మైండ్‌ బ్లాక్‌ పాటకు నా 20 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నడూ లేనంత రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే, ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ విలక్షమైనది. మొదటి నుంచి మేము అనుకున్న క్లైమాక్స్‌ ఇదే. వేరే ఏమీ అనుకోలేదు. ఈ కథకు ఆ క్లైమాక్స్‌ మినహా మరేదీ సరిపోదు. కావాలంటే, ఆలోచించి చూడండి. నేను పూర్తిగా దర్శకుడిని నమ్మా! చెప్పినట్టు చేశా. అయితే, జనంలో ఇంత హిస్టీరియా వస్తుందని నేనూ అనుకోలేదు. హ్యాట్సాఫ్‌ టు ది డైరెక్టర్‌!

సినిమాలోని డైలాగ్‌ లాగే, మీ పారితోషికం కూడా నెవర్‌ బిఫోర్‌ అని వార్త!
ఈ చిత్రాన్ని అభిమానులు, ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు అద్భుతం. వస్తున్న వసూళ్ళు, అనూహ్యమైన ఆ అంకెలు చూస్తుంటే నేను చాలా హ్యాపీ. సినిమా అనేది ఎప్పుడూ ఒక కల్చరల్‌ ఎక్స్‌పీరియన్స్‌. పైగా, ఇప్పుడు తెలుగు మార్కెట్‌ చాలా పెద్ద మార్కెట్‌. బాహుబలి లాంటి సినిమాలు వచ్చిన తరువాత మన మార్కెట్‌ బాగా విస్తరించింది. అందుకే భారీ బడ్జెట్‌ సినిమాలు వస్తున్నాయి. జనానికి నచ్చితే అందుకు తగ్గ భారీ వసూళ్ళూ వస్తున్నాయి. అందుకు తగ్గట్టే పారితోషికాలు!

ఆ స్థాయి పారితోషికమంటే, మరి ఇంకెప్పుడు హిందీ సినీ రంగ ప్రవేశం?
ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పాను. మరో వందసార్లు అడిగినా, నా మాట ఒకటే నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ హిందీ చిత్రసీమకు వెళ్ళనండీ! నాకు తెలుగు సినిమా రంగమే శ్వాస, ధ్యాస. మన మూలాలు, మన భావోద్వేగాలే మనకు బలం. ఈ సినిమా, ఇక్కడి ప్రజల ఆశీస్సులే నాకు ముఖ్యం. వీళ్ళను ఆనందంగా ఉంచితే చాలు. తెలుగులో చేసిన సినిమా ఇతర భాషల్లోకి అనువాదమై, ఏకకాలంలో అక్కడా విడుదలైతే ఓ.కె. అంతేతప్ప, హిందీ ఫీల్డ్‌లోకి వెళ్ళను.

పోనీ, బాహుబలి లాంటి అఖిల భారత చిత్రాలు చేయచ్చుగా? దర్శకుడినీ, టెక్నీషియన్లనూ పూర్తిగా నమ్మి, సరెండర్‌ అవుతారట!
నా దృష్టిలో ప్రత్యేకించి ప్యాన్‌ ఇండియన్‌ చిత్రాలు అనడమే రాంగ్‌. మనం మంచి సినిమా అని మొదలుపెడతాం. భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా అది అందరికీ కనెక్ట్‌ అయితే అదే ప్యాన్‌ ఇండియన్‌ సినిమా. నేను నమ్మే సిద్ధాంతం ఒకటే. కథ నచ్చి, ఒకసారి దర్శకుడికి ఓకె చెప్పాక అతణ్ణి పూర్తిగా నమ్మాలి. అలా చేస్తేనే మన నుంచి వేరే వేరే కొత్త పర్ఫార్మెన్సులు వస్తాయి. దటీజ్‌ ఆల్వేస్‌ బీన్‌ మై ప్రిన్సిపుల్‌. అలా కాకుండా, మనం ఎప్పుడూ అలవాటైన నటన, పద్ధతిలోనే ఉంటే రొటీన్‌గా అందులోనే ఉండిపోతాం. ఇక, టెక్నీషియన్లు సినిమాకు గుండెకాయ లాంటివాళ్ళు. వాళ్ళ పనితనం వల్లే నటీనటులు ఎలివేట్‌ అవుతారు. అందుకే, వాళ్ళ పనితనాన్ని అందరం అభినందించాలనేది నా పద్ధతి.

ఒకప్పుడు మీరు పబ్లిసిటీకి దూరం. మీ పాత్రలానే మీరూ పబ్లిసిటీకి బాగా ఓపెన్‌ అయినట్టున్నారు!
ఇరవై ఏళ్ళ క్రితం మనం కలిసినప్పటికీ, ఇప్పటికీ మీరూ, నేనూ మారాం కదా. అనుభవంతో అనేక అంశాలలో ఓపెన్‌ అప్‌ అవుతాం. ఇదీ అంతే. పైగా, ఈ రోజుల్లో సరైన పబ్లిసిటీ కీలకం.

గతంలో చిన్న ఎన్టీఆర్‌, ఈసారి చిరంజీవి… మీ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్లకు సమకాలీన పెద్ద హీరోలొచ్చి మాట్లాడుతున్నారే!
అవును. ఇదొక ఆరోగ్యకరమైన వాతావరణం. చిరంజీవి, రజనీకాంత్‌ లాంటివాళ్ళు నాకు ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌. ‘సరిలేరు…’ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు పిలవడానికి చిరంజీవి గారిని కలవడానికి సిద్ధమయ్యా. ఈలోగా ఆయనను ఆహ్వానించాలనుకుంటున్నట్టు సూచనప్రాయంగా సమాచారం తెలియజేయగానే, నేను కలవక ముందే ఆయనే వస్తానని అంగీకారం తెలిపారు. అంత మంచి మనసు ఆయనది.

ఏడాదిలో వెయ్యి ఆపరేషన్లు!
మా ఊరు బుర్రిపాలెం అభివృద్ధికి వీలైనంత చేస్తున్నాం. అలాగే, ఆంధ్రా హాస్పటల్‌ వాళ్ళతో కలసి పిల్లలకు ఆపరేషన్లు చేయించే పనుల్లో భాగస్వాములయ్యాం. ఏడాదిలో దాదాపు వెయ్యిమందికి ఆపరేషన్లు చేశారు. హీల్‌ ఎ ఛైల్డ్‌ సంస్థ వాళ్ళతో జత కలిశా. వాళ్ళు ఎంతోమంది జీవితాలను కాపాడారు. ఇలాంటి మంచి పనుల్లో భాగం అవుతుంటే, చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలని యోచిస్తున్నాం. అన్నీ నమ్రతే చూసుకుంటుంది.

మీ నాన్న గారు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండేవారు. కానీ మీరు దూరంగా ఉంటున్నారేం?
అదేమీ లేదు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా టచ్‌లోనే ఉంటున్నా కదా. కీలకమైన, తప్పనిసరిగా స్పందించాల్సిన అంశాలుంటే, నా మీడియా టీమ్‌ను సంప్రతించవచ్చు. నేను మాట్లాడతా!

మేడమ్‌ టుస్సాడ్స్‌ సింగపూర్‌ వారు చేసిన మీ మైనపుబొమ్మ ఆ మల్టీప్లెక్స్‌లో ఓ ఎట్రాక్షన్‌.
ప్రపంచ ప్రసిద్ధుల బొమ్మలు పెట్టే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌ వాళ్ళు నా బొమ్మ కూడా చేయడం నాకు ఓ ఎఛివ్‌మెంట్‌. చాలా ఆనందంగా ఉంది. మా మల్టీప్లెక్స్‌లో నా బొమ్మ ఇప్పుడు సరిలేరు పాత్రలో ఆర్మీ డ్రెస్‌లో ఉంది. పిల్లలకు అదో ఆకర్షణ.

మార్కుల మొదలు పిల్లల ప్రతి విషయంలో మీరే ఎక్కువ గారాబం చేస్తారట. పైగా పిల్లలతో మాటిమాటికీ టూర్లు వెళుతుంటారు.
మాటిమాటికీ కాదు..వాళ్ళకు సెలవులు, స్కూళ్ళకు ఇబ్బంది లేనప్పుడే టూర్లు ప్లాన్‌ చేస్తుంటా. వాళ్ళ స్కూళ్ళు, చదువులు, మార్కులు అంతా నా భార్య నమ్రత డిపార్ట్‌మెంట్‌. అంతా తనే చూస్తుంది. వాళ్ళ అమ్మ కన్నా నేను కొద్దిగా గారాబం చేస్తా.

కుటుంబంలోనే కాక, మీ కెరీర్‌, పబ్లిసిటీల్లోనూ నమ్రతదే కీలక పాత్రేమో?
నా జీవితానికి నమ్రత ఒక బ్యాలెన్సింగ్‌ ఫ్యాక్టర్‌. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, పనులు, సమస్యలు ఏవీ నమ్రత నా దాకా రానివ్వదు. బయట ఎంత శ్రమపడి ఇంటికి వెళ్ళినా, అక్కడ నాకు ప్రశాంతత ఉంటుంది. నాదైన ఒక స్పేస్‌ ఉంటుంది. ఎవరికైనా జీవితంలో అది చాలా కీలకం. అప్పుడే మనం బయట ఏదైనా సాధించగలుగుతాం. విజయవంతమైన ఏ వివాహబంధానికైనా అది చాలా కీలకం. ఇక, నా వాణిజ్య ప్రకటనల వ్యవహారాలు, నా డిజిటల్‌ పబ్లిసిటీ టీమ్‌ సారథ్యం – అన్నీ నమ్రతే చూసుకుంటుంది. నేను చేయాల్సిందల్లా ఒప్పుకున్న సినిమాకు వెళ్ళి, నటించి రావడం, సంపాదన ఇంటికి తెచ్చివ్వడం అంతే.

విజయనిర్మల గారు పోయాక మీ నాన్న హీరో కృష్ణ గారిని ఎలా అనునయించారు?
విజయనిర్మల గారి ఆకస్మిక మరణం నాన్న గారికే కాదు, మాకూ ఒక డార్క్‌ ఫేజ్‌. దాదాపు నెల రోజుల పాటు నాన్న గారు బాగా కుంగిపోయారు. నాలుగైదు నెలల పాటు మొత్తం మా కుటుంబానికి చాలా కష్టకాలం. తరచూ వెళ్ళి, నాన్న గారికి మానసికంగా అండగా నిలబడేందుకు ప్రయత్నించాం. క్రమంగా నాన్న గారు కోలుకున్నారు. ఆయన తన ఆత్మస్థైర్యంతో మామూలు అవుతూ వచ్చారు. ఇప్పటికీ వీకెండ్స్‌లో మా అమ్మ గారి ఇంటి దగ్గర, స్టూడియో దగ్గర కలుసుకుంటూ, మాట్లాడుతున్నా. మొన్న నా సరిలేరు’ చూశాక ఆయన కళ్ళలో కనిపించిన ఆ వెలుగు, ఆనందం చూసి, నేను చాలా హ్యాపీ.

సీరియ్‌సగా కనిపించే మీరు సెట్‌లో సెటైర్లు పేలుస్తుంటారట. ఆ ఉత్సాహం, తరగని మీ గ్లామర్‌ వెనుక రహస్యం?
ఇందాక చెప్పినట్టు ఆ క్షణంలో బతకడమే! వీలైనంత వరకు ఆనందంగా ఉండాలనుకుంటా. నాతో పాటు సెట్లో ఉండే అందరూ సరదాగా ఉంటే, ఆ రిజల్ట్‌ తెరపై కనిపిస్తుంది. నా జీవన సిద్ధాంతం ఒకటే నిన్న, మొన్నటి గురించి ఆలోచించకు. ఇవాళలో, ఈ క్షణంలో బతుకు. చేస్తున్న పనిలో, ఉంటున్న క్షణంలో పూర్తిగా లీనమైతే, అదే నిజంగా బతకడం. అదే జీవితానికి ఆనందం.

మీ తదుపరి ప్రాజెక్టులు? మణిరత్నం, రాజమౌళి, శంకర్‌లతో సినిమాల మాటేమిటి? అతడు, ఖలేజా అందించిన త్రివిక్రమ్‌తో తరచూ యాడ్స్‌ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు?
కొద్దిగా విరామం తీసుకొని, వెంటనే వంశీ పైడిపల్లితో సినిమా చేస్తా. మణిరత్నం గారితో ఇప్పుడేమీ లేదు. నా అభిమాన దర్శకుడు శంకర్‌తో ఎప్పటికైనా చేస్తా. రాజమౌళితోనూ చేయాల్సి ఉంది. ఆయన మంచి స్ర్కిప్టుతో వస్తే, చేస్తా.

ఒకప్పుడు మీ సోదరి మంజుల హీరోయిన్‌గా వస్తే, వివాదమైంది… మరి మీ అమ్మాయి విషయంలో..?
సమాజం, పరిస్థితులు చాలా మారాయి. ఒకప్పటి పితృస్వామ్య భావజాలం ఇప్పుడు సరిపోదు. ఇప్పటి జనరేషన్‌ పిల్లలను మనం కంట్రోల్‌ చెయ్యలేం. పదమూడేళ్ళ వయసులో మనకున్న అవగాహనకూ, ఇప్పుడు వారికున్న తెలివితేటలకూ సంబంధమే లేదు. నన్నడిగితే పిల్లలు సరైన మార్గంలో వెళ్ళేలా జాగ్రత్తపడుతూ బాగా పెంచాలే తప్ప, వాళ్ళ మీద మార్కులు, చదువులు, మన ఇష్టాలు రుద్దకూడదు. వాళ్ళ ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు వాళ్ళవి. సితార నటిస్తానంటే, నేను వద్దనను. ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రం ఫ్రోజెన్‌ 2 కి తెలుగులో సితార డబ్బింగ్‌ చెప్పింది. అలాగే, తన స్నేహితురాలు ఆద్య తో కలసి యూట్యూబ్‌ ఛానల్‌లో కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా నన్నూ ఇంటర్వ్యూ చేశారు.

Share

Leave a Comment