ఇమేజ్‌ కంటే అది ముఖ్యం

సంక్రాంతికి వినోదాలు పంచడం మహేష్‌కి కొత్త కాదు. ఈసారి సరిలేరు నీకెవ్వరు అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. క్లాస్‌ మాస్‌ తేడా లేకుండా అందరికీ వినోదం పంచుతున్నారు. మూవీ హిట్‌ని టీమ్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ వార్తా పత్రిక తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

సంక్రాంతి పండగ నాకు చాలా ప్రత్యేకం. చిన్నప్పుడు నాన్న మా సొంతూరు బుర్రిపాలెం తీసుకెళ్లేవారు. అక్కడ గడిపిన రోజులు ఇప్పటికీ గుర్తే. ఆ తర్వాత సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది సినిమానే. నాన్నగారి సినిమా ఏదో ఒకటి విడుదలయ్యేది. నేను హీరో అయ్యాక నా సినిమాల్లో ఒక్కడు, బిజినెస్‌ మేన్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలయ్యాయి.

ఈ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా పండగ జనవరి 11నే మొదలైంది. మా చిత్రబృందం మామూలు జోష్‌లో లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ బంగారం. దాని పరిధి పెరుగుతూనే ఉంటుంది. మా వ్యాపారం, మా ఇమేజ్‌ కంటే ప్రేక్షకుడికి ఎక్కువ ఆనందాన్నివ్వడం ముఖ్యం.

నాలుగేళ్లు వరుసగా కథా బలమున్న చిత్రాలు చేశా. మాకు దూకుడు లాంటి సినిమా కావాలని అభిమానులు చెబుతూనే వస్తున్నారు. అనిల్‌ రావిపూడి సరిలేరు కథ చెప్పాక వారు కోరుకుంటున్నది ఇదే అనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరిన్ని చేస్తా. వ్యక్తిగతంగా నాకూ ఓ కొత్త ఉత్సాహాన్నిచ్చిందీ చిత్రం.

విడుదల రోజునే పిల్లలతో కలిసి ఇంట్లోనే చూస్తాం. ఈసారి కొత్త హోమ్‌ థియేటర్‌ కట్టుకున్నా. అందులో సినిమా చూస్తూ ఎంత ఆస్వాదించామో. తొలిసారి గౌతమ్‌ నాన్నా మళ్లీ చూడాలనుంది అన్నాడు. రెండోసారీ చూశాడు. అది నేను సాధించిన ఒక గొప్ప లక్ష్యం అని భావిస్తున్నా. మా నాన్నగారు సినిమా చూసి నీ కెరీర్‌లోనే పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని, దర్శకుడిని కలవాలని ఉందని చెప్పారు.

గౌతమ్‌, సితార ఇంట్లో చేసే సందడి చూస్తే చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తుంటాయి. అదే సమయంలో చాలా తొందరగా పెద్దోళ్లు అయిపోతున్నారే అనిపిస్తుంటుంది. ఈ తరం పిల్లల్లో వేగం ఎక్కువ. గౌతమ్‌ 13 ఏళ్లకే పెద్ద పెద్ద మాటలు చెబుతుంటాడు. సినిమాల గురించి అన్ని విషయాలూ అడుగుతున్నాడు. మంచి స్క్రిప్టు దొరికితే తప్పకుండా నటిస్తాడు.

నాన్న విషయంలో రోజూ సరిలేరు మీకెవ్వరు అనిపించేది. స్టార్‌గా ఏ స్థాయికి చేరుకున్నా ఇంటికొచ్చాక అవన్నీ పక్కనపెట్టి మాతో గడిపేవారు. ఇప్పుడు నేనూ ఆయన బాటలోనే వెళుతున్నా. ఇమేజ్‌, బ్లాక్‌బస్టర్‌ ఇవన్నీ మరిచిపోయి గౌతమ్‌, సితారలకి తండ్రిగా, నమ్రతకి భర్తగా గడుపుతుంటా.

తెలుగు సినిమా చాలా పెద్దదైపోయింది. ప్రేక్షకులు, అభిమానులు, ట్రెండ్, మార్కెట్‌ వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలి. ఒక పెద్ద సినిమా చేయడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. కేవలం కథ నచ్చింది కదా అని ఈ రోజుల్లో సినిమాలు చేయలేం. అన్ని కోణాల్లో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

నేను డైరెక్టర్స్‌ యాక్టర్‌ని. వారితో నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాలేకపోతే సినిమా చేయలేను. నేను ఎవరితో సినిమా చేస్తే ఆ సినిమా దర్శకుడితో నాకు ఓ భావోద్వేగంతో కూడిన ప్రయాణం తప్పక ఉంటుంది. నా దర్శక–నిర్మాతలతో నేను చాలా స్నేహపూర్వకంగా ఉంటాను.

మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను మా బ్యానర్‌ లో తప్పకుండ ప్రొడ్యూస్‌ చేస్తాను. డిఫరెంట్‌ సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ విస్తృతి పెరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వంటివారు పెద్ద పెద్ద హాలీవుడ్‌ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హీరోగా నా దృష్టి అంతా వెండితెరపైనే.

Share

Leave a Comment