మహేష్ గురించి త‌రుణ్ భాస్క‌ర్

పెళ్లి చూపులు హిట్‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు త‌రుణ్ భాస్క‌ర్‌. ఆ సినిమాతో టాలీవుడ్‌లో మ‌రో కొత్త ఒర‌వ‌డి మొద‌లైన‌ట్ట‌య్యింది. న్యూ ఏజ్డ్ ల‌వ్ స్టోరీల‌కు ఈ సినిమాతో త‌లుపు తీశారు త‌రుణ్ భాస్క‌ర్. తాను అనుకుంటే, వ‌చ్చిన అవ‌కాశాల‌న్నీ అందిపుచ్చుకుంటే త‌ప్ప‌కుండా త‌న రెండో సినిమాని ఓ స్టార్ హీరోతోనే ప‌ట్టాలెక్కించేవారు. కానీ అలా చేయ‌లేదు.

త‌న స్కూల్ లోనే, మ‌ళ్లీ కొత్త‌వాళ్ల‌తో ఓ ప్ర‌యోగం చేశారు. ఆ సినిమాలో ఒక్క‌టీ తెలిసిన మొహం లేదు. ఆఖ‌రికి ప్రియ‌ద‌ర్శిని ని కూడా రిపీట్ చేయ‌లేదు. ఓ విధంగా ఇది రిస్కే. ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ అనే టైటిల్‌, సురేష్ బాబు, త‌రుణ్ భాస్క‌ర్‌ల పేర్లు త‌ప్ప‌కుండా ఆక‌ర్షించేవే. కాక‌పోతే ‘స్టార్‌’ క్యాట‌గిరీలో చేర‌డానికి వ‌చ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా జార‌విడుచుకున్నారు.

స్టార్ హీరోల గురించి అడగగా త‌రుణ్ భాస్క‌ర్ ఇలా చెప్పారు. పెళ్లిచూపులు చిత్రం తర్వాత స్టార్ హీరోల నుంచి అభినందనలు వచ్చాయి. ‘పెళ్ళిచూపులు’ స‌క్సెస్‌ను అప్రిషియేట్ చేశారు. ఎక్కడా నెగ‌టివ్ అనేది రాలేదు. మహేష్ బాబు గారిని క‌లిశాను. ఆయన జెన్యూన్‌గా అప్రిషియేట్ చేయ‌డ‌మే కాకుండా ఏదైనా స్టోరీ రెడీగా ఉంటే, వెంట‌నే కాల్ చేయ‌మ‌ని కూడా చెప్పారు.

ఆయన తన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక కధ రెడీ చేయమన్నారు. మహేష్ బాబు ఈజ్ ఎ ట్రు సూపర్ స్టార్. ఆయన అలా చెప్పినప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేయడానికి నాకు ఇంకా టైమ్ కావాలి, ఇంకా సినిమా అర్థం కావాలి అని అనుకున్నాను. అది అర్థమైన త‌ర్వాత స్టార్ హీరోలతో త‌ప్పకుండా సినిమాలు చేస్తాను.

నా తర్వాత సినిమాకి కూడా ముందు స్టోరీ రాస్తా. త‌ర్వాత ఎవ‌రితో చేయాల‌నే దాని గురించి ఆలోచిస్తా. కొత్తవాళ్లతో చేయాలా? ఇంకెవ‌రితోనైనా చేయాలా? అనేది స్టోరీ రెడీ అయిన తర్వాతే ఆలోచిస్తా అని తెలిపారు. పెళ్ళిచూపులు తరువాత అతడి నుంచి మరో సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఈసారి కూడా అందరూ కొత్త వాళ్లను పెట్టి ఒక విభిన్నమైన సినిమా ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ తీశారు తరుణ్. ఇది మంచి చిత్రంగా టాక్ సంపాదించుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ చిత్రం డెహ్రాడూన్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంది. తాజాగా ఈ షెడ్యూల్ ముగిసింది. పూజ హెగ్డే హీరోయిన్ గా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.

Share

Leave a Comment