మురారి తెరవెనుక తెలియని విశేషాలు

తనదైన స్టయిల్లో కొత్త కోణాన్ని అందంగా చూపిస్తూ, తెరనిండుగా వెలుగును నింపగల క్రియేటివ్‌ జీనియస్‌ కృష్ణవంశీ గారు ఒక హీరో కోసం ఎదురు చూస్తున్న రోజులు అవి… సరిగ్గా అప్పడే మహేష్‌తో జోడీ కుదిరింది. తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోలేని సినిమా పుట్టుంది. అలా వచ్చిన “మురారీ” మహేష్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచి ఒకమెట్టు పైకి ఎక్కించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరచేసింది.

సంకల్పం ఓ కల్పవృక్షం.. ఏది మనం బలంగా కోరుకుంటే అదే మన చెంతకి వస్తుంది.. నమ్మకం ఓ ఐరావతం.. మనల్ని ఎంత దూరాలకైనా మోసుకెళ్తుంది.. ఇదే పాయింట్ మీద మురారి సినిమాని చిత్రీకరించారు. మురారి సినిమా గురించి మీకు తెలియని విశేషాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని వెరీ ఇంట్రస్టింగ్ డీటేల్స్ మీకోసం…

* మహేష్ బాబు అయితే 104 డిగ్రీల జ్వరంలో కూడా గోదావరి ఒడ్డున “డుం డుం డుం నటరాజు ఆడాలి” పాట, వాటర్ ఫైట్ చేశాడు. వీటికి విశేషమైన స్పందన లభించింది. అకేలా క్రేన్ అనే స్పెషల్ పరికరాన్ని వాడిన రెండో తెలుగు సినిమా ఇది. ఈ పాటను కొవ్వూరులోని గోదావరి ఒడ్డున తీశారు. అక్కడ జరిగిన వాటర్ ఫైట్ కు కూడా ఇదే క్రేన్ ను ఉపయోగించి చిత్రీకరించారు.

* కృష్ణవంశీ ఎక్కువగా సీతారామశాస్త్రి గారితోనే పాటలు రాయించుకుంటారు. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను వేటూరితో రాయించుకోవాలనుకున్నారు. పల్లవి వరకూ రాసి మళ్లీ కనబడలేదాయన. ఓ రోజు సడెన్ గా మద్రాసులోని మణిశర్మ రికార్డింగ్ స్టూడియోకొచ్చారు. కృష్ణవంశీ వదల్లేదు. తర్వాత రాసిస్తానని చెప్పినా వదిలిపెట్టలేదు. అక్కడే ఓ చెట్టు కింద కూర్చోబెట్టి వేటూరి చెబుతుంటే, కృష్ణవంశీ రాసుకున్నారు. 20 నిముషాల్లో పాట పూర్తయిపోయింది. “అల్లూరి సీతారామరాజు” ప్రస్తావన కావాలని అడిగి మరీ రాయించుకున్నారు కృష్ణవంశీ.

* మహేష్, సోనాలీ బెంద్రేల పాత్రలు రెండూ మొదట్లో కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి. లవ్ లో పడ్డామనే విషయం తెలుసుకునే సీన్ ఎలా ఉండాలా అని కృష్ణవంశీ చాలా ఆలోచించారు. సడెన్ గా ఐడియా రావడంతో అప్పటికప్పుడు తీసేశారు. మహేష్ సూట్ కేస్ సర్దుకుని ఊరెళ్లబోతుంటే, సోనాలీ ఆ రూమ్ లోకి వస్తుంది. ఆమెను చూడగానే మహేష్ సూట్ కేస్ విసిరేసి, ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత సూట్ కేస్ తీసుకుని వేగంగా వెళ్లిపోతాడు. “చెప్పమ్మా చెప్పమ్మా” సాంగ్ కు ఇదే లీడ్ సీన్.

* ఈ సినిమా కోసం కైకాల సత్యనారాయణ, లక్ష్మి, గొల్లపూడి మారుతీరావు ఇలా చాలామంది హేమాహేమీలుని ఒప్పించారు. బామ్మ పాత్రకు బెంగుళూరు వెళ్లి మరీ షావుకారు జానకికి కథ చెప్పారు. కానీ 40 రోజుల డేట్స్ అంటే కష్టం అందావిడ. ఫైనల్ గా సుకుమారి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. మళయాళంలో సీనియర్ యాక్ట్రెస్, ఒకప్పటి ప్రసిద్ధ దర్శకుడు ఎ.భీమ్ సింగ్ గారి వైఫ్ ఆమె..

* చెప్పమ్మా చెప్పమ్మా పాటలో ఓ చోట ముగ్గు సోనాలీ బెంద్రేలా మారే షాట్ ఉంది కదా..దానికి హాలీవుడ్ సినిమా టెర్మినేటర్ ఇన్ స్పిరేషన్.. అందులో జైలు సీన్లో విలన్ తో చేసిన షాట్ చూసి ఇంప్రెస్ అయ్యి, కృష్ణవంశీ ఇక్కడ అప్లై చేశారు. తెలుగులో డిజిటల్ ఎడిటింగ్ చేసిన రెండో సినిమా ‘మురారి’ కావడం విశేషం.

* 65 సంవత్సరాల వయసులో జిక్కీ గారితో మణిశర్మ పాడించిన అలనాటి రామచంద్రుడు సాంగ్ ఒక సెన్సేషన్. ఇప్పటికీ ఎక్కడైన పెళ్ళి జరుగుతుందంటే ఈ పాట వినపడుతూనే ఉంటుంది. శోభన్, నందినీ రెడ్డి, శ్రీవాస్, కుమార్ నాగేంద్రలు ఈ సినిమాకు అసిస్టెంట్స్ గా పనిచేసి తర్వాతి కాలంలో డైరెక్టర్స్ అయ్యారు.

* సినిమాలో ఇంపార్టెంట్..టెంపుల్ సీన్స్. మూడు తరాల నేపథ్యానికి సంబంధించిన సీన్స్ అక్కడే తీయాలి. అంటే చాలా పురాతనమైంది కావాలి. ఇప్పట్లో లాగా గూగుల్ మ్యాప్స్, ఇంటర్నెట్ అందుబాటులో లేవు కాబట్టి, చాలా ఎంక్వైరీలు చేశారు. శంషాబాద్ టెంపుల్ కు ఫిక్సయ్యారు. ఓ ఏనుగు కావాలి. ఇక్కడెక్కడా దొరకదు. కేరళ నుంచి దిగుమతి చేసుకున్నారు.

* అమితాబ్ బచ్చన్, జయబాధురి దంపతులు “మురారి” చూసి కృష్ణవంశీ ని మెచ్చుకున్నారు. మహేష్ నటన అద్భుతమని కొనియాడారు. హిందీ లో అభిషేక్ బచ్చన్ తో రీమేక్ చేయమని కృష్ణవంశీ అడిగారు. తెలుగు లో ఉన్న కమిట్మెంట్స్ వల్ల చేద్దాం అనుకున్నా కృష్ణవంశీ కి కుదర్లేదు.

* తమిళంలో ఈ సినిమాను ఇదే టైటిల్ తో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కలిసి డబ్ చేశారు. తమిళంలో కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. తూర్పుగోదావరి జిల్లా పంపిణీ హక్కుల్ని ఎక్కువ మొత్తానికి కృష్ణవంశీ తీసుకున్నారు. ఆ రోజుల్లోనే ఆయనికి 40 లక్షల లాభం తీసుకొచ్చింది.

* ఫైట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ కు ఇదే ఫస్ట్ ఫిల్మ్. ‘సముద్రం’ సినిమాకు కనల్ కణ్ణన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు, అతని చొరవ, దూకుడు చూసి కృష్ణవంశీ, మహేష్ ఇంప్రెస్ అయి ఆఫరిచ్చారు. హస్యనటుడు చిత్తజల్లు లక్ష్మిపతికి ఇదే తొలిచిత్రం. ఆయన సోదరుడు శోభన్ ఈ సినిమాకు సహకార దర్శకుడు. ఆయన నటనకి చాలా మంచి పేరు వచ్చింది.

* సుద్దాల అశోక్ తేజ తో ఓ పాట రాయించారు. అప్పటివరకూ ఎర్రపాటల బ్రాండ్ ఉన్న సుద్దాలకు ఈ పాటతో మంచి బ్రేక్ వచ్చింది. ఆయన కెరీర్ కూడా టోటల్ గా టర్న్ అయింది ఈ సినిమా వల్లనే. ఈ పాటలోని “కాలం మాయల మరాఠీ” అనే లైన్ అంటే కృష్ణవంశీకి చాలా ఇష్టం.

* క్లైమాక్స్ లో కీలకపాత్ర కోసం ఎవరైనా సీనియర్ నటుడుంటే బాగుంటుందనుకున్నారు. “దానవీరశూరకర్ణ” లో శకునిగా చేసి రిటైరైపోయిన ధూళిపాళ గారి దగ్గరకు కృష్ణవంశీ వెళ్లి ఒప్పించారు. ఆ ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్ అంత అద్భుతంగా పండిందంటే అందులో ఈయన వంతు కూడా ఉంది.

* నటులు రఘబాబు, రవిబాబులకు ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. రఘబాబు లో విలనిజాన్ని, రవిబాబు కామిక్ టైమింగ్ ని అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమా అంతా రామచంద్రపురం కోటలోనే తీశారు.. ముందు పార్ట్ అంతా మహేష్ ఇల్లుగాను, వెనుక పార్ట్ అంతా సోనాలీ ఇల్లుగాను చూపించారు..

ఐదు నెలల షూటింగ్. రోజుకి 12 గంటల తక్కువ పని చేయలేదు. అంతమంది ఆర్టిస్టులతో సెట్ అంతా సందడే సందడి. మహేష్ బాబు అయితే ఫస్ట్ డే నుంచే క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. కృష్ణవంశీ టేకింగ్ కు ఫిదా అయిపోయాడు. సినిమా విడుదల అయ్యాక మెల్లమెల్లగా ఊపందుకుంది. కలెక్షన్ల వర్షం కురవడం మొదలైంది. జనం విరగబడి చూసేశారు. మహేష్ పెర్ఫామెన్స్ పీక్స్ అని కృష్ణ గారబ్బాయిలా కాకుండా మహేష్ గా ప్రిన్స్ ను జనం గుర్తించేలా చేసింది మురారి.

Share

Leave a Comment