ఇంతకంటే గొప్ప గౌరవం ఉంటుందా?

వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం `మ‌హ‌ర్షి`. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. వరుస పెట్టి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సమాజం పట్ల, సామాజిక అంశాల పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ముఖ్యంగా ఈ సినిమాలో రైతు స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించిన తీరు ప్ర‌శంస‌లు అందుకుంటోంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో ఎంతో విలువలతో కూడిన సందేశాన్నిచ్చారు. దీంతో మహేష్ అభిమానులతో పాటు దేశంలోని సినీ తారలు, పొలిటిషన్స్ మహేష్‌ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే మహర్షి సినిమాను ప్రశంసిస్తూ పలువురు స్టార్స్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సోషల్ మీడియా వేదికగా మహర్షి సినిమాపై తన స్పందనను తెలిపారు. మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’.

సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు చూడాలని రైతులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు కాబట్టి స్వయంగా రికమండ్ చేయడం విశేషం.

ఇది మహర్షి సాధించిన మరో ఘనతగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఓ రీజనల్ సినిమా గురించి స్పందించడం అరుదు. అలాంటిది భారతదేశపు రెండో పౌరుడు ఇలా కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే మాటలా. ఇప్పుడీ ట్వీట్ మహేష్ బాబుతో పాటు ఫ్యాన్స్ కు ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా.

గతంలో కూడా మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాపై వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీమంతుడు ఒక సందేశాత్మక చిత్రమని, సినిమా చూస్తుంటే తన చిన్నతనం గుర్తుకొచ్చిందని వెంకయ్యనాయుడు స్పందించారు. తాజాగా మరోసారి మహేష్ మహర్షి సినిమాపై అదే వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించడం విశేషం.

ఈ ట్వీట్‌కు మ‌హేష్ బాబు ధ‌న్య‌వాదాలు తెలిపారు. `స‌ర్‌.. మీ అభినందన నాకు వ్య‌క్తిగ‌తంగానే కాదు.. మా చిత్ర‌బృందానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయ‌కం, గౌర‌వ‌ప్ర‌దం. మీ ప్ర‌శంస‌లు `మ‌హ‌ర్షి`లాంటి మ‌రెన్నో ఉత్త‌మ చిత్రాలు చేయ‌డానికి స్ఫూర్తిగా నిలుస్తాయంటూ` మ‌హేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి.

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ మూవీ మహేష్‌ 25వ సినిమా కూడా కావటంతో మరింత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లాంటి ముగ్గురు బడా నిర్మాతలు రూపొందించారు. గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. కలెక్షన్ల పరంగా మహర్షి సంచలనాలు నమోదు చేస్తోంది.

విడుదలైన నాలుగు రోజుల్లోనే మహర్షి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. అంతేకాదు టాలీవుడ్‌లో మహేష్ నటించిన ఐదు సినిమాలు (దూకుడు, శ్రీమంతుడు, స్పైడర్‌, భరత్‌ అనే నేను, మహర్షి) రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఈ ఘనత సాధించిన ఏకైక టాలీవుడ్‌ నటుడు మహేష్ కావడం విశేషం.

స్టార్ క‌థానాయ‌కుల సినిమాలంటే ఇలానే ఉండాలి అనే నియ‌మాన్ని ఎప్పుడో పక్కన పెట్టి కొత్త రూల్స్ ను రాసిన స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు. క‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే ఏకైక స్టార్ ఆయన. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు.

అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశారు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అలాంటి ఒక మంచి కథను ఎంచుకుని ‘మ‌హర్షి’గా మారారు.

Share

Leave a Comment