స్టార్ సినిమాల్లో రేర్ అన్న విజయశాంతి

దాదాపు దశాబ్ధం పాటు రాజకీయాల్లో తలమునకలుగా ఉన్న విజయశాంతిని తెలుగు తమిళంలో ఎంతోమంది దర్శకులు నటించాల్సిందిగా సంప్రదించినా ససేమిరా అన్నారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఒకప్పుడు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న రోజులలో అతడికి తల్లిగా నటించిన విజయశాంతిని సరిలేరు నీకెవ్వరు కోసం ఏం చెప్పి ఒప్పించగలిగారు అంటే లేడీ బాస్ విజయశాంతి స్వయంగా ఆ సీక్రెట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెనయ్యారు.

ఈ దశాబ్ధ కాలంలో ఎందరో దర్శకులు నా వెంట పడ్డారు. సినిమాల్లో నటించాల్సిందిగా అడిగారు. కానీ నేను అంగీకరించలేదు. అందరు దర్శకుల్లానే అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో నన్ను నటించాల్సిందిగా సంప్రదించారు. నేను రకరకాల వ్యాపకాల్లో బిజీగా ఉన్నప్పుడు ఏదో సినిమా గురించి చెప్పాడు. అప్పట్లో నటించను అని చెప్పాను. చూద్దాం ఆ ఆలోచన వస్తే అని తిరస్కరించాను.

కానీ ఆయన విడిచి పెట్టలేదు. మళ్లీ మళ్లీ అప్రోచ్ అయ్యారు. గత ఎన్నికలు జరుగుతున్న సమయంలో నన్ను కలిసి ఒకసారి కథ వినండి నచ్చితే చేయండి అని అన్నారు. ఎన్నికలు అయిపోయాక ఫ్రీ అవుతాను, నచ్చితే చేస్తాను నచ్చకపోతే చేయను తప్పుగా అనుకోకండి అన్నాను. ఆ తర్వాత కథ విన్నాను. కథలో కామెడీ బాగా ఎంజాయ్ చేశాను.

నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాను. నా పాత్ర గురించి మళ్లీ విన్నాను. బావుంది అన్నాను. బావుంది అన్న తర్వాత చేయాల్సిందే. రిజెక్ట్ చేయడం తప్పు అవుతుందని ఓకే చెప్పాను. నా రీఎంట్రీకి ఇది కరెక్ట్ గా ఉంటుంది అనిపించి ఓకే చెప్పాను. పైగా ఈ సినిమాలో మా మహేష్ బాబు హీరో. మా కృష్ణ గారి అబ్బాయి.

మహేష్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న సినిమాలో ఫీమేల్ కి ఇంత మంచి పాత్ర ఉండడం రేర్. నేను హీరోలతో చేసేప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పటి జనరేషన్ దర్శకులు డిఫరెంటుగా వెళుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక సూపర్ స్టార్ సినిమాలో నా పాత్ర ఇలా కుదరడం అరుదు అనే చెప్పాలి. హుందాగా ఉండే పాత్ర ఇది. మిమ్మల్ని దృష్టి లో పెట్టుకునే ఈ పాత్రను రాశానని అనిల్ అన్నారు.

అందుకే నటించాను. మొదటి సినిమా రాజకుమారుడు చూడగానే ఈ అబ్బాయి సూపర్ స్టార్ అవుతాడు అనిపించింది. ఇంతకుముందు ఇంటర్వ్యూలోనూ ఇది చెప్పాను. ఎందుకో ఆరోజు అలా అనిపించింది. ఇప్పుడు అనుకున్నట్టే మహేష్ సూపర్ స్టార్ అయ్యారు. మహేష్ సెట్లో అమ్మ అని, మ్యాడమ్ అని పిలుస్తారు. మహేష్ ని బాబు అని పిలుస్తాను. సెట్ లో ఉన్నప్పుడు ఎవరితో అయినా గౌరవంగా ఉండాలి.

గౌరవం కాపాడాలి. హీరోల్ని గౌరవించాలి. సెట్ లో ఉన్నా ఇంట్లో ఉన్నా మర్యాద తప్పనిసరి. కృష్ణ గారు సాఫ్ట్. మహేష్ డౌన్ టు ఎర్త్, చాలా సాఫ్ట్, హంబుల్. సీనియర్లను గౌరవిస్తారు. తండ్రిలానే ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు. తను సెట్లో చాలా సరదాగా ఉంటారు. పెద్ద వాళ్లంటే గౌరవంగా ఉంటారు. మహేష్ పాత్రకు, నా పాత్రకు మధ్య ఎలాంటి సవాళ్లు ఉండవు.

సినిమాలో మా పాత్రల మధ్య రిలేషన్ కూడా చాల బాగుంటుంది అని విజయశాంతి తెలిపారు. సరిలేరు నీకెవ్వరు సెట్స్ నుంచి సూపర్ స్టార్ మహేష్, లేడీ బాస్ విజయశాంతి కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. వీటికి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఈ చిత్రంలో విజయశాంతి భారతి అనే ప్రొఫెసర్ గా నటిస్తున్నారు.

మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తూనే డిఫరెంట్ షేడ్ తో ఆకట్టుకోనున్నారు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ఫినిష్ చేసిన చిత్రబృందం కేరళ రాష్ట్రంలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా షెడ్యూల్ ప్రకారమే సరిలేరు నీకెవ్వరు షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం మేర పూర్తయిందని తెలుస్తోంది. తాజాగా కేరళ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ ఫినిష్ అవుతుందని అంటున్నారు. 2020 సంక్రాంతికి సినిమా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

Share

Leave a Comment